స్టార్టప్‌లకు కేంద్రంగా హైదరాబాద్‌ | Hyderabad is the center of startups | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు కేంద్రంగా హైదరాబాద్‌

Feb 5 2019 1:10 AM | Updated on Feb 5 2019 1:10 AM

Hyderabad is the center of startups - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్టార్టప్‌లకు కేంద్రంగా మారిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్‌ అనూప్‌ వాదవాన్‌ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఐటీ ఎగ్జిబిషన్‌ అండ్‌ కాన్ఫరెన్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూర్‌ తరువాత హైదరాబాద్‌ సిలికాన్‌ వ్యాలీగా పిలవబడుతుందని చెప్పారు. ఐటీ సంస్థలతో పాటు రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ సంస్థలు ఉండటంతో ఐటీ రంగంలో హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. సేవల ఎగుమతి, ఫారెన్‌ ఎక్సే్చంజ్‌లో ఐసీటీ (ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ) కృషి చేస్తోందని తెలిపారు. ఈ పరిశ్రమ అభివృద్ధికి అనుకూల పరిస్థితులు కల్పించడంలో మన దేశం ముందంజలో ఉందన్నారు. ఇండియాలో సాఫ్ట్, ఎక్స్‌పోర్ట్‌ ఈవెంట్‌లు అరుదుగా జరుగుతాయన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో దాదాపు 200 కంపెనీలు వివిధ టెక్నాలజీలను ప్రదర్శించాయని వివరించారు. 60 దేశాలకు చెందిన కొనుగోలుదారులు ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, ఐటీ ఆ«ధారిత సేవలను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదు ప్రధాన ఐటీ కంపెనీలైన ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్‌లు హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఇది ఓ నిదర్శనమని అన్నారు. హైదరాబాద్‌ టెక్నాలజీ హబ్‌గా ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. అనంతరం స్టాటిస్టికల్‌ బుక్‌–2018ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి సంజయ్‌చందా, ఇండియా సాఫ్ట్, గ్లోబల్‌ సాఫ్ట్‌ చైర్మన్‌ నలిన్‌ కోహ్లీ, ఈఎస్‌సీ చైర్మన్‌ మనుదీప్‌సింగ్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.కె.సరీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement