కుటుంబ కలహాలతో భార్యను దారుణంగా నరికి చంపిన ఓ వ్యక్తి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పటాన్‌చెరు రూరల్: కుటుంబ కలహాలతో భార్యను దారుణంగా నరికి చంపిన ఓ వ్యక్తి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని భానూర్ గ్రామంలో సోమవారం జరిగింది. బీడీఎల్ భానూర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భానూర్ గ్రామానికి చెందిన మోటె నారాయణ (55), మోటె చంద్రమ్మ (48) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పిల్లలందరికీ వివాహాలై వేరుపడడంతో చంద్రమ్మ, నారాయణలు కూడా చిన్న కుమారుడు మోటె కుమార్ ఇంటి పక్కనే మరో ఇంట్లో కాపురం ఉంటున్నారు. అయితేకుటుంబంలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో దంపతులిద్దరూ తరచూ గొడవపడేవాడు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దంపతులిద్దరూ గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో నారాయణ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి నిద్రలేచిన నారాయణ గొడ్డలితో చంద్రమ్మపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం నారాయణ మనువడు తలుపుకొట్టినా ఎవరూ తీయక పోవడంతో ఇంట్లోకి తొంగి చూశాడు.
నారాయణ, చంద్రమ్మలు విగత జీవులుగా కనిపించడంతో వెంటనే విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. దీంతో నారాయణ చిన్న కుమారుడు కుమార్ వెంటనే తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా రక్తపు మడుగులో తల్లి, మరోచోట తండ్రి మృతి చెంది కనిపించారు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా, బీడీఎల్ సీఐ రవీందర్‌రెడ్డి, రామచంద్రాపురం డీఎస్పీ కవిత సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.