రాష్ట్రానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం | Hudco Rs .3,100 crore loan to the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం

Dec 11 2015 12:39 AM | Updated on Aug 31 2018 8:24 PM

రాష్ట్రానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం - Sakshi

రాష్ట్రానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం

తెలంగాణలో గృహ నిర్మాణ పథకానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గృహ నిర్మాణ పథకానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాష్ట్రం నుంచి సమగ్ర ప్రతిపాదన వస్తే వీలైనంత ఎక్కువగా ఇళ్లను మంజూరు చేస్తామని, ఎలాంటి వివక్ష చూపబోమని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీలు కేశవరావు,  వినోద్, జితేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి గురువారమిక్కడ వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు.

గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల మంజూరు, హైకోర్టు విభజన, ముంపు గ్రామాల సమస్య, అమృత్ పథకం పట్టణాల జాబితాలో సిద్దిపేటను చేర్చడం తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనన్న అయుత చండీయాగానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం కేసీఆర్... వెంకయ్యను ఆహ్వానించారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి భూ మి, లబ్ధిదారుల వివరాలను అందచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. మురికివాడల్లో రూ.లక్ష, సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి రూ.1.50 లక్షలు, రుణం కింద ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.2.30 లక్షల సహకారం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రతిపాదనలు అందచేస్తామని చెప్పినట్లు వివరించారు. తెలంగాణలోని 12 అమృత్ నగరాల్లో సిద్దిపేటను చేర్చామన్నారు.

 పవార్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు
 75వ జన్మదినం సందర్భంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శరద్ పవార్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తుచేశారు.
 
 ఒకట్రెండు రోజుల్లో ఎంపీలతో సమావేశం
 తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపుపై మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుకోడానికి అవకాశం ఉంది. అయితే రాజ్యాంగాన్ని లేదా విభజన చట్టాన్ని సవరించడం విషయంలో గందరగోళంగా ఉంది. దీనిపై న్యాయశాఖ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడాను. ఒకట్రెండు రోజుల్లో నేను, కేశవరావు, వినోద్ సమావేశమై అధ్యయనం చేస్తాం. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు సూత్ర రీత్యా అభ్యంతరం లేదు. విభజన చట్టంలో చిన్న లొసుగు ఉంది. ‘నాట్ విత్ స్టాండింగ్’ పదం వాడాల్సింది. కానీ అలా జరగలేదు’’ అని అన్నారు.

హైకోర్టు విభజన విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత.. ఆయన అంగీకారం తెలుపుతూ న్యాయశాఖకు లేఖ రాస్తే తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఏపీలో విలీనం చేసిన ముంపు గ్రామాల్లో రహదారుల సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడి ప్రతిపాదన పంపితే సానుకూలంగా స్పందిస్తామన్నారు. ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న చండీయాగానికి రావాల్సిందిగా సీఎం ఆహ్వానించారని, తాను హాజరవుతానని చెప్పారు. తెలంగాణకు తక్కువ ఇళ్లు మంజూరు చేయడంపై ప్రశ్నించగా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనల మేరకే ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రతిపాదన ఆలస్యానికి కేసీఆర్ కారణాలను చెప్పారన్నారు. డబుల్‌బెడ్రూం పథకం రూపకల్పన తర్వాత సమగ్ర ప్రతిపాదన పంపుతామని సీఎం చెప్పారన్నారు. రాష్ట్రంలోని ఎయిమ్స్‌కు వచ్చే ఏడాది నిధులు కేటాయిస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement