రెండో శనివారం సెలవులు రద్దు!

Holiday Cancelled On 2nd Saturday Over Corona In telangana - Sakshi

పనిదినాల సర్దుబాటుకు తప్పని పరిస్థితి

పూర్తికాని టెన్త్,డిగ్రీ పరీక్షలు.. వెలువడని ఇంటర్‌ ఫలితాలు

కరోనా అదుపులోకి వచ్చాకే తదుపరి కార్యాచరణ

ఆలస్యం కానున్న వచ్చే విద్యా సంవత్సర ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్, ఉన్నత విద్యలో రెండో శనివారం సెలవులు రద్దయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు విద్యాశాఖ ఇదే విధానాన్ని అమ లు చేయాల్సి వస్తుందని అధికారులు పేర్కొం టున్నారు. ఇప్పటివరకు పాఠశాల విద్యాశాఖ టెన్త్‌ పరీక్షలను పూర్తి చేయలేదు. మరోవైపు ఇంటర్‌ ఫలితాలు వెలువడలేదు. డిగ్రీ పరీక్షలు నిర్వహించలేదు. లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ ముగిశాక విద్యాకార్యక్రమాలు చేపట్టినా జూన్, జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైతే పనిదినాలను, సెమిస్టర్‌ విధానాన్ని సర్దుబాటు చేసేందుకు రెండో శనివారం సెలవులు రద్దు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

విద్యాసంవత్సరం ఆలస్యం తప్పదు...
మార్చి 19న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మూడు పేపర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 8 పేపర్లు నిర్వహించాల్సి ఉంది. కరోనా ప్రభావంతో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్మీయట్‌ ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తి కాలేదు. గత నెలలో నిర్వహించాల్సిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా అదుపులోకి వస్తే వీటిని నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే ఇంకా కొన్నాళ్లు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలను నిర్వహించి వాటి మూల్యాంకనం పూర్తి చేసి, ఫలితాలు ఇచ్చేటప్పటికి జూన్‌ రెండో వారం వస్తుంది. అప్పుడు ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు చేపట్టి తరగతులు మొదలుపెట్టేసరికి జూలై వచ్చేస్తుంది. దీంతో ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరంలో ఆలస్యం తప్పదు.

ఇక ఆ తర్వాత కాలేజీల పని దినాలు సర్దుబాటు చేసేందుకు రెండు శనివారం సెలవులను రద్దు చేయకతప్పని పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్‌ మూల్యాంకన పూర్తి చేసి, డిగ్రీ, ఇంజనీరింగ్‌ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇంకా సమయం పట్టనుంది. పైగా ఆయా కాలేజీల అఫీలియేషన్లు పూర్తి చేయడంలో ఆలస్యం తప్పదు కనుక విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు ఇప్పటికీ డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి కాలేదు. వచ్చే నెలలో ఈ పరీక్షలను నిర్వహించి, ఫలితాలను జూలై నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టినా విద్యా సంవత్సరంలో ఆలస్యం తప్పదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top