
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్‌లపై పుట్టగొడుగుల్లా ఆక్రమణలు వెలుస్తున్నా వాటిని తొలగించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై మెట్లు, ర్యాంపులు నిర్మించుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల వల్ల పాదచారులు గత్యంతరం లేక రోడ్లపై నడుస్తున్నారని, ఇకనైనా ఆక్రమణల తొలగింపు విషయంలో కఠిన చర్యలు ప్రారంభించి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తేల్చి చెప్పింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి. శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ది అంబర్ బజార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. ఆక్రమణదారుల పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కమిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.