ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు హైకోర్టు కళ్లెం!

High Court Put A Lock for Private Medical Colleges - Sakshi

సీట్ల బ్లాకింగ్‌ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మార్చండి

కాలేజీల్లో చేరే గడువు ముగిసిన తర్వాతే మరో కోటా

సాక్షి, హైదరాబాద్‌: కౌన్సెలింగ్‌ సందర్భంగా కొందరు విద్యార్థులను ఉపయోగించుకుంటూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేస్తున్న కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు కళ్లెం వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, మాప్‌ అప్‌ రౌండ్‌ కింద సీట్లు భర్తీ చేసేందుకు వివిధ తేదీల్లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లోని లోపాలను అడ్డంపెట్టుకుని సీట్లను బ్లాక్‌ చేసు కుంటూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కోట్లు గడిస్తున్న క్రమంలో.. కౌన్సెలింగ్‌ తేదీలనే మార్చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఒక్క కోటా కింద కౌన్సెలింగ్‌ పూర్తయి, విద్యార్థులు కాలేజీలో చేరేందుకు నిర్ణయించే గడువు తేదీ ముగిశాకే మరో కోటా కింద కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. కన్వీనర్‌ కోటా కింద ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించి, సీట్లు పొందినవారు కాలేజీలకు రిపోర్ట్‌ చేసేందుకు ఏప్రిల్‌ 8, 9 తేదీలను గడువు గా ఖరారు చేయాలంది. అప్పుడు ఏప్రిల్‌ 10 తర్వాతే యాజమాన్య కోటా కింద మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని, దీంతో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చీ.. కాలేజీల్లో చేరని వారినే ఈ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంది. కన్వీనర్‌ కోటా కింద రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలను ఏప్రిల్‌ 20, 21లుగా నిర్ణయిస్తే, ఏప్రిల్‌ 30న కాలేజీల్లో చేరేందుకు చివరి తేదీగా ఖరారు చేయాలంది.

మే 1 తర్వాత యాజమాన్యపు కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని తెలిపింది. యాజమాన్య కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాతే మాప్‌ అప్‌ రౌండ్‌ నిర్వహించాలని ఆదేశించింది. యాజమాన్యపు కోటాకు సైతం మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించొచ్చని, కన్వీనర్‌ కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ పూర్తయి, కాలేజీల్లో చేరే గడువు ముగిశాకే మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సందర్భంగా అభ్యర్థులందరి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలని, దీంతో ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను పావులుగా వాడుకునే అవకాశం ఉండదని తెలిపింది. విద్యార్థుల కేటాయింపులు పూర్తయ్యాక వర్సిటీలే నేరుగా అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆయా కాలేజీలకు పంపించే దిశగా ఆలోచన చేయాలంది. దీని వల్ల సీట్ల బ్లాకింగ్‌ను నిరోధించేందుకు అవకాశం ఉందంది. వైద్య విద్య వ్యాపారీకరణను అడ్డుకునే దిశగా పరిష్కారాలను అన్వేషించాలని విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

జరగాల్సిన నష్టం జరిగి పోయింది...
యాజమాన్యపు కోటా కింద పలు ప్రైవేటు కాలేజీలు సీట్ల బ్లాకింగ్‌ ద్వారా అక్రమాలకు పాల్పడ్డాయని, అందువల్ల ఈ కోటా కింద జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ పి.రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. పిటి షనర్‌ కోరిన విధం గా యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఈ కోటా కింద సీట్లు పొందిన అనేక మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని, అందువల్ల పిటిషనర్‌ అభ్యర్థనను ఆమో దించలేమంది.

2018–19 విద్యా ఏడాదికి జరిగిన ప్రవేశాల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, దాన్ని పూర్వ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని తెలిపింది. ప్రవేశాల తుది గడువు ముగిసినందున, పిటిషనర్‌కు వేరే కాలేజీలో ప్రవేశం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదంది. వచ్చే విద్యా ఏడాది నుంచి అవి జరగక్కుండా ఉండేందుకు వర్సిటీ తీసుకుంటున్న పరిష్కార మార్గాలేమిటో చూడాలంది. వర్సిటీ కౌంటర్‌ను పరిశీలిస్తే, కౌన్సెలింగ్‌ తేదీల్లో ఉన్న లోపాల వల్లే సీట్ల బ్లాకింగ్‌ జరిగినట్లు అర్థమవుతుందని తెలిపింది. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలంటూ వర్సిటీకి సూచించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top