తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు | High Court Orders Telangana Government Over Private School Fees | Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్‌ క్లాస్‌లపై యూనిఫామ్‌ పాలసీ తీసుకు రావాలి’

Jul 1 2020 12:52 PM | Updated on Jul 1 2020 1:56 PM

High Court Orders Telangana Government Over Private School Fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు పాఠశాలలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. వసూళ్ల కోసం  స్కూళ్లు పంపించిన సందేశాలను, వాయిస్‌లను సాక్షాలుగా కోర్టుకు చూపించింది. దీంతో ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వాహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యూలర్‌ జారీ చేసిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా)

హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిషేధించారని పేర్కొన్న హైకోర్టు.. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావద్దని ప్రభుత్వాలు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లపై యూనిఫామ్‌ పాలసీ తీసుకు రావాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించగా, జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్‌లైన్‌ క్లాస్‌లపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారే విషయం కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. (ఆన్‌లైన్‌ ‘దందా’)

Advertisement
 
Advertisement
Advertisement