‘ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల’ ఫలితాలు ప్రకటించొద్దు  | Sakshi
Sakshi News home page

‘ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల’ ఫలితాలు ప్రకటించొద్దు 

Published Sat, Mar 3 2018 4:38 AM

High Court orders on Forest Beat Officers results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర అటవీశాఖలోని బీట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ఫలితాల్ని 8 వారాల పాటు వెల్లడించరాదని ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ యాక్ట్‌ ప్రకారం 2 శాతం పోస్టుల్ని మాజీ సైనికులకు రిజర్వు చేయాలన్న నిబంధనను ఉల్లంఘించి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారన్న కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సైనికోద్యోగి ఆర్‌.రఘుపతిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

ప్రతివాదులైన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, అటవీ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. అటవీ శాఖలో 1,857 బీట్‌ ఆఫీసర్ల పోస్టులకు గతేడాదిలో నోటిఫికేషన్‌ వెలువడిందని, ఇందులో మాజీ సైనికోద్యోగులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించలేదని విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.వెంకటేశ్‌ గుప్తా వాదించారు. మాజీ సైనికోద్యోగులకు రిజర్వేషన్లు కల్పించేలా ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్‌ను సవరించాలని కోరారు. దీంతో నోటిఫికేషన్‌ పరిశీలించిన న్యాయమూర్తి.. పరీక్షల ఫలితాల్ని నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. 

Advertisement
Advertisement