డాక్టర్‌ కావాలనుకుని.. జడ్జినయ్యా!

High Court Judge Amarnath Goud interview with sakshi - Sakshi

న్యాయమూర్తిగా నియామకం కావడం నా అదృష్టం 

‘సాక్షి’తో హైకోర్టు న్యాయమూర్తి అమర్‌నాథ్‌గౌడ్‌ 

హైదరాబాద్‌: దేశంలోని అత్యున్నత స్థాయి వ్యవస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం లో ‘సాక్షి’తో మాట్లాడారు. కృషి, పట్టుదలతో శ్రమి స్తే తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వైద్యుడిని కావాలన్న ఉద్దేశంతో ఎంసెట్‌ రాశానని, అది వీలుకాకపోవడంతో డిగ్రీ చేసి ఎంబీఏ చదవాలని అనుకున్నానన్నారు. ఇలా మథనపడుతున్న నేపథ్యంలో తన బాబాయ్‌ సలహాతో న్యాయ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. పట్టుదలతో లా చదివి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టినట్లు వివరించారు. 

సమాజ సేవ కోసం కృషి..: సమాజ సేవ కోసం తన వంతు కృషి చేసేందుకు ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ స్థాపించినట్లు చెప్పారు. దానికి తానే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. దీని ద్వారా మూడేళ్లలో సుమారు 300లకుపైగా కేసులను పరిష్కరించినట్లు అమర్‌నాథ్‌గౌడ్‌ తెలిపారు. అలాగే 18 ఏళ్ల నుంచి లయన్స్‌ క్లబ్‌ ద్వారా ఎన్నో విధాలుగా ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. వృద్ధాశ్రమం, సికింద్రా బాద్‌ అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూల్‌ను దత్తత తీసుకుని కావాల్సిన సౌకర్యాలు సమకూర్చినట్లు తెలిపారు. సమాజానికి సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి ఉందని అభిప్రాయపడ్డారు.

గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం, హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు లేక విద్యార్థులు, సామాన్యులు ఇబ్బం దులు పడటం వంటి సమస్యలపై తాను స్పందించి న్యాయసేవ అందించానన్నా రు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులందరూ కలుపుగోలుగా ఉంటూ తన ఉన్నతికి సహకరించారన్నారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నుంచి బెంచ్‌ వరకు వచ్చిన వారందరితో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.  

ప్యారడైజ్‌ ఫ్యామిలీగా..: 1965 మార్చి 1న తొడుపునూరి కృష్ణగౌడ్, సావిత్రమ్మకు రెండవ సంతానంగా అమర్‌నాథ్‌గౌడ్‌ జన్మించారు. వెస్లీ జూనియర్‌ కాలేజీలో ఇంటర్, బేగంపేట్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. మహారాష్ట్రలోని శివాజీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1980లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వంగ ఈశ్వరయ్య వద్ద వృత్తి జీవితం ప్రారంభించానన్నారు. తమకు ప్యారడైజ్‌ అనే థియేటర్‌ ఉండటంతో అంతా ప్యారడైజ్‌ ఫ్యామిలీగా పిలిచేవారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top