ఆ భూములు హెచ్‌ఎండీఏవే..

High Court Cleared The Case Of Bahubali Layout Land Of kokapet - Sakshi

హైకోర్టు తీర్పు... కోకాపేట లే–అవుట్‌కు తొలగిన అడ్డంకి

నకిలీ పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్లు

ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు

హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ చొరవతో విజయం

సాక్షి, హైదరాబాద్‌: సకల సౌకర్యాలతో భవిష్యత్‌ ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ‘బాహుబాలి లే–అవుట్‌’గా తీర్చిదిద్దుతున్న కోకాపేట భూములపై ఉన్నత న్యాయస్థానంలో ఉన్న స్టేటస్‌ కో అడ్డంకులు తొలగిపోయాయి. గత 8 నెలలుగా న్యాయపోరాటం చేసిన హెచ్‌ఎండీఏ వాదనలతో హైకోర్టు ఏకీభవించడంతో పాటు కోర్టును తప్పుదోవ పట్టించిన ఆరుగురు పిటిషన్‌దారులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని పేర్కొంటూ..రిట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే ఈ లే–అవుట్‌ పనులు చకచకా జరిగే అవకాశముంది. 195.47 ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయించడం ద్వారా రూ.5,850 కోట్ల ఆదాయం వస్తుందని గతంలో అధికారులు అంచనా వేసినా.. ఇప్పుడు ఆ స్థాయిలో ఆదాయం సమకూరుతుందా..అనే యోచనలో ఉన్నారు. కరోనా ప్రభావం కోకాపేట భూముల విక్రయాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశముందని, దీంతో మరికొన్ని నెలల తర్వాతనే ఆన్‌లైన్‌ వేలంపై ముందుకు వెళ్లే అవకాశాలున్నాయనే వాదనలు కూడా వినబడుతున్నాయి.

8 నెలలుగా న్యాయపోరాటం...
తమ ఫిజికల్‌ పొజిషన్‌లో ఉన్న కోకాపేట సర్వే నంబర్‌ 239, 240లలోని 87.68 ఎకరాల భూమి లో హెచ్‌ఎండీఏ అధికారులు వచ్చి లే– అవుట్‌ అభివృద్ధి చేస్తున్నారంటూ ముక్తజాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో గతేడాది అక్టోబర్‌ 8న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ భూమి తమ పేరు మీద ఉందంటూ రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా జత చేయడంతో కోర్టు అదే నెలలో స్టేటస్‌ కో విధించింది. ఈ భూముల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్, ఎస్టేట్‌ విభాగ ఉన్నతాధికారి గంగాధర్‌ వాటికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టుకు సమర్పించారు.

2017లో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చే ముందు అంటే 2009–10లో ఇదే కోకాపేట భూములపై వేసిన రిట్‌ పిటిషన్‌లో ఇప్పటి పిటిషన్‌దారులు అందరూ ఇంప్లీడ్‌ అయి ఉన్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అంతకుముందు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తేయడంతో పాటు రిట్‌ పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషన్‌దారులకు జైలు శిక్ష విధించాలని హెచ్‌ఎండీఏ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గిరి వాదించారు. పిటిషన్‌దారులు వృద్ధులు కావడంతో రూ.లక్ష చొప్పున జరి మానా విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top