వాన..వడగళ్లు.. | Sakshi
Sakshi News home page

వాన..వడగళ్లు..

Published Mon, Apr 2 2018 2:28 AM

Heavy Rain in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల దెబ్బకు పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో 150 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు కొన్ని గంటలపాటు అంతరాయం కలిగింది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజగుట్ట, బేగంపేట, ప్యాట్నీ, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, ఏఎస్‌రావునగర్, నాచారం, చర్లపల్లి, ముషీరాబాద్, అశోక్‌నగర్, లాలాపేట్, చిలకలగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, పార్శిగుట్ట, మారేడుపల్లి, తుకారాంగేట్, కార్ఖానా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధగంటకు పైగా వర్షం కురవడంతో పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది. అక్కడక్కడ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో గ్రేటర్‌ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరవాసులకు ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది.

నిలిచిన విద్యుత్‌ సరఫరా
ఈదురుగాలులు, వడగళ్ల వానతో హబ్సిగూడ, తార్నాక, ఉప్పల్, హయత్‌నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, మెహదీపట్నం, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఆదివారం నగరంలో గరిష్టంగా 38.7 డిగ్రీలు, కనిష్టంగా 25.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం
ప్రాంతం           వర్షపాతం
ముషీరాబాద్‌    2.7 సెం.మీ
అంబర్‌పేట్‌        1.7 సెం.మీ.
మౌలాలి         1.3 సెం.మీ.
బేగంపేట్‌         6.3 మి.మీ.
ఎల్బీనగర్‌        3.5 మి.మీ.
బండ్లగూడ        6 మి.మీ.

Advertisement
Advertisement