గ్రేటర్‌లో ‘కరోనా’ అలర్ట్‌!

Health Department Coronavirus Alert in Hyderabad - Sakshi

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

స్వైన్‌ఫ్లూ బాధితులకు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు  

గాంధీ మైక్రోబయాలజీలోని  వైరాలజీ ల్యాబ్‌లో టెస్టులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోనూ కరోనా ఫీవర్‌ భయం పట్టుకుంది. గత కొద్ది రోజులుగా చైనీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘కరోనా’ వైరస్‌ నగరానికి విస్తరించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. చైనాలో ఇప్పటికే 440 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడం, వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది వరకు చనిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. స్వైన్‌ఫ్లూ, కరోనా వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉండటం, భారత్‌ నుంచి చైనాకు..ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చిపోతున్న ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉండటం, కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. స్వైన్‌ఫ్లూ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి చేరుకుంటున్న బాధితులకు గురువారం నుంచి హెచ్‌1 ఎన్‌1 పరీక్షలతో పాటు కరోనరి వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా బాధితుల నుంచి నమూనాలు సేకరించి ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగంలోని వైరాలజీల్యాబ్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 

ఆ రెండు ఒకేలా ఉండటంతో..
స్వైన్‌ఫ్లూ వైరస్‌ మాదిరే కరోనా వైరస్‌ కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్‌ వాతావరణంలో చేరి, గాలి ద్వారా సమీపంలో ఉన్నవారికి సోకుతుంది. కరోనా వైరస్‌ మనిషికి సోకిన పది రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతాయి. స్వైన్‌ఫ్లూలో కన్పించే లక్షణాలే (దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు)కరోనాలోనూ కన్పిస్తాయి. ఈ రెండు లక్షణాలు ఒకేలా ఉండటం వ్యాధి గుర్తింపు వైద్యులకు కూడా కష్టమే. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తే తప్పా..కరోనా నిర్ధారణ చేయలేం. నిమోనియా తీవ్రతకు శ్వాస తీసుకోవడం కష్టమవు తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌ బారిన పడుకుండా ముందజాగ్రత్తగా ఎలాంటి యాంట్రిరెట్రో వైరస్‌ మందులు, టీకాలు అందుబాటులో లేకపోవడం ఆందోళన
కలిగిస్తుంది.

వ్యక్తిగత పరిశుభ్రతే కీలకం
కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.  
ఇప్పటికే జెనివాలో అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసి, ఆయా దేశాలను అప్రమత్తం చేసింది.  
కరోనా వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది.
సాధ్యమైనంత వరకు దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.   
చైనా, దాని సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటివి చేయరాదు.
వ్యక్తిగత పరిశుభ్రత కీలకం. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్‌బారి నుంచి కాపాడుకోవచ్చు.  
విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ క్యాంపులు ఏర్పాటు చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. – డాక్టర్‌ శ్రవణ్, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top