అధికారుల నిర్లక్ష్యంతో అటవీ గ్రామాల్లో భూసంబంధమైన వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. అసైన్‌మెంట్, అటవీ భూములకు ఎలాంటి హద్దులు నిర్ణయించకపోవడంతో గిరిజనులు ఎవరికి వారు భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు.
ధర్మపురి : అధికారుల నిర్లక్ష్యంతో అటవీ గ్రామాల్లో భూసంబంధమైన వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. అసైన్‌మెంట్, అటవీ భూములకు ఎలాంటి హద్దులు నిర్ణయించకపోవడంతో గిరిజనులు ఎవరికి వారు భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఈక్రమంలో భూమి తమదంటే తమదని దాడులు చేసుకుంటున్నారు. ఇదే కోవలో గురువారం మండలంలోని తుమ్మెనాలలో 564 కంపార్టుమెంటులో సుమారు 50ఎకరాల అటవీ భూమి తమదంటే తమదని తుమ్మెనాలవాసులు, పెద్దనక్కలపేట పరిధిలోని బోదరగూడానికి చెందిన గిరిజనులు పరస్పరం దాడులు చేసుకున్నారు.
కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఫారెస్టు సెక్షన్ అధికారి బాపురాజు, సర్వేయర్ చంద్రయ్య రెండు గ్రామాలకు హద్దులు నిర్ణయిస్తుండగా వివాదం చెలరేగింది. సదరు భూమిలో బోదరగూడానికి చెందిన గిరిజనులు మూడు రోజులుగా చెట్టు నరుకుతూ సాగుకు యోగ్యంగా మలుచుకుంటున్నారు. ఇందుకు తుమ్మెనాలవాసులు అభ్యంతరం చెబుతున్నారు. ఆభూమి గ్రామ పరిధిలోనే ఉందని, గ్రామస్తులకే చెందాలని పట్టుబడుతూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వేయర్ వచ్చి హద్దులు నిర్ణయిస్తుండగా బోదరగూడెం గిరిజనులు వచ్చి అడ్డుకున్నారు.
తుమ్మెనాలవాసులు కూడా ఎదురు తిరిగారు. ఒకరినొకరు తోసేసుకున్నారు. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో బోదరగూడానికి చెందిన తట్ల శంకర్, తట్ల నర్సవ్వ, తుమ్మెనాలకు చెందిన రేని మల్లవ్వ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకు ముందే కొందరు గిరిజనలు పోలీసులకు సమస్య వివరించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. అటవీ భూములు తమకే చెందాలని గిరిజనలు, తుమ్మెనాలకే చెందాలని వీఎస్‌ఎస్ చైర్మన్ పద్మాకర్, ఉపాధ్యక్షుడు మల్లేశం పట్టుబట్టారు.