మైనార్టీలకు సర్కారు అండ

Harish rao ramazan gifts distribution in siddipet - Sakshi

మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటలో రంజాన్‌ బహుమతుల పంపిణీ  

సాక్షి, సిద్దిపేట: ‘అల్లా దయతో స్వరాజ్యం సాధించుకున్నాం. అంతా కలసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో కూడా రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో 3,000 మంది పేద ముస్లిం కుటుంబాలకు ఆయన రంజాన్‌ పండుగ బహుమతులు అందచేశారు. మంత్రి మాట్లాడుతూ కరువు, కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ఇందుకోసం అల్లా దీవెన కూడా అవసరమని అన్నారు. ఇదే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణలోని బీళ్లను గోదావరి జలాలతో తడుపుతామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముస్లిం యువతుల వివాహానికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అలాగే మైనార్టీ గురుకులాలు ప్రారంభించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు.

ఈ సర్పంచ్‌లు అదృష్టవంతులు..
ప్రస్తుత సర్పంచ్‌లు అదృష్టవంతులని  హరీశ్‌ అన్నారు. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, గ్రామాలకు సమీపంలో జిల్లా కేంద్రాలు కూడా వచ్చాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, దీంతో సర్పంచ్‌లకు ప్రజలకు మరింత సేవచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు తదితరులు  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top