షెడ్యూల్ కులాలకు చెందినవారికి స్వయం ఉపాధి/ఆర్థిక మద్దతు పథకాల అమలుకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది.
- భూ పంపిణీకి నిధులు కేటాయిస్తూ మరో ఉత్తర్వు
హైదరాబాద్: షెడ్యూల్ కులాలకు చెందినవారికి స్వయం ఉపాధి/ఆర్థిక మద్దతు పథకాల అమలుకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ముగింపునకు వస్తున్నా... ఎస్సీ కార్పొరేషన్ ఇంకా కార్యాచరణ ప్రణాళికే (యాక్షన్‌ప్లాన్) సిద్ధం చేయలేదంటూ 8వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వార్తా కథనంపై స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 101లోని కొన్ని అంశాలను తాజా జీవోలో ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని పేర్కొంటూ ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు.
భూపంపిణీకి నిధులు..
భూపంపిణీ కింద ఆరు వేలమంది లబ్ధిదారులకు ఈ ఏడాది రూ. 900 కోట్లతో భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు సంబంధించిన ఉత్తర్వులనూ ప్రభుత్వం జారీ చేసింది. దీంతో పాటు 8,768 మంది లబ్ధిదారులకు భూమి అభివృద్ధికి రూ. 100 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. బ్యాంకుల ద్వారా రూ.14.19 కోట్లు రుణం అందించనుంది. బ్యాంకు లింక్డ్ పథకాలకు సంబంధించి 8,759 మంది లబ్ధిదారులకు (60శాతం సబ్సిడీ)రూ. 83.49 కోట్లు, బ్యాంకురుణం, ఇతరాలు (40 శాతం) రూ. 72,03కోట్లు కలుపుకొని మొత్తం రూ.155.53 కోట్లుగా ఈ ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది.