బిందు సేద్యంపై పన్నుపోటు

gst not minimizing sprinklers expenses - Sakshi

పెరిగింది కొండంత..  తగ్గింది గోరంత

బిందు సేద్య పరికరాలపై తప్పని ట్యాక్స్‌ ఎఫెక్ట్‌

18 శాతం పన్ను నుంచి 12 శాతానికి కుదింపు

సన్న, చిన్నకారు రైతులపై తప్పని పన్ను భారం

ఆసక్తి తగ్గించిన అన్నదాతలు

ఈ ఏడాది దరఖాస్తు దారులు 900 మంది

అందరికీ అందిస్తామంటున్న అధికారులు

రైతన్న సాగుకోసం ఉపయోగించే పరికరాలపై కేంద్ర ప్రభుత్వం గతంలో 18 శాతం ట్యాక్స్‌ పెంచింది. ఆ పన్నులను ఇటీవల కంటి తుడుపు చర్యగా  6 శాతం మేర తగ్గించింది. సాగునీటి వనరులు లేని పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న మెతుకుసీమలో రైతులను సూక్ష్మసేద్యం దిశగా ప్రోత్సహించాల్సిన అధికారులు, పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలతోనే సరిపెడుతున్నారు.  జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న సూక్ష్మసేద్యం 5 శాతం పన్నును జీఎస్టీ తర్వాత ఏకంగా 18 శాతానికి పెంచారు. దీంతో నేడు బిందు, తుంపర సేద్య పరికరాలు, రైతుకు భారంగా మారాయి.  18 శాతం ఉన్న జీఎస్టీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం 6శాతం తగ్గించి  12 శాతం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత మేర ఊరట కలిగినప్పటికీ రైతులపై భారం మాత్రం తప్పడం లేదు. 

మెదక్‌జోన్‌:  జిల్లా వ్యాప్తంగా నీటి పొదుపునకు సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ,  ఇతరులకు 90 సబ్సిడీపై బిందు తుంపర సేద్య పరికరాల యూనిట్లు మంజూరు చేసి ప్రోత్సహించింది. దీంతో సాగు నీరు తక్కువగా ఉన్న  జిల్లాలలో రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది. జిల్లాలో 

2016–17 సంవత్సరంలో 1,100 మంది రైతులకు   9,50 హెక్టార్లలో బిందుసేద్యం యూనిట్లను   అందించారు. ఇందుకోసం రూ. 6.5 కోట్లు కేటాయించారు.  ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా అందించగా  ఇతర కులాల వారు కేవలం 5 శాతం పన్ను భరించాల్సి ఉండటంతో ఈలెక్కన రూ.50 లక్షలను  రైతుల వాటాగా  భరించారు. కాగా  2017–18  జులై ఒకటి నుండి  18 శాతం జీఎస్టీ  అమల్లోకి  రావటంతో  సుమారు 900  మంది రైతులకు 750 హెక్టార్లకు బిందుసేద్యం కోసం   ప్రభుత్వం  రూ. 4.80  కోట్లు మంజూరు చేసింది.  ఇందులో రైతుల వాటా సుమారు  రూ. 80 లక్షలు భరించాల్సిన పరిస్థితి. జిల్లాలో ఈ ఏడాది బిందు సేద్యంపై  వెయ్యి హెక్టార్లను సాగులోకి తీసుక రావాలనే లక్ష్యంగా నిర్దేశించగా కేవలం 900 హెక్టార్లకు మాత్రమే రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో లాగా బిందు సేద్యం పరికరాలకు రైతులు ముందుకు రావడం లేదు.   

ప్రాజెక్టులు లేకపోవడమే..
బిందు తుంపర సేద్యానాకి  దరఖాస్తు చేసుకుంటున్న వారిలో అత్యధికులు సన్నా, చిన్నకారు రైతులే. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఖర్చులు చేసి  బోర్లు వేయించుకునే స్థోమత లేక పోవడం,  ప్రస్తుతం ఉన్నబోరు బావుల్లో నుంచి వచ్చే కొద్దిపాటి నీటిని ఉపయోగించుకునేందుకు బిందు, తుంపర సేద్యం రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. జిల్లాలో  చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేకపోవటంతో బోర్ల ఆధారంగానే అధిక సంఖ్యలో రైతులు  పంటలను సాగుచేస్తున్నారు.  

ఎకరం పంటపొలం సాగు చేసె రైతులు   బిందు, తుంప సేద్యంతో 3 ఎకరాల్లో పంటలను  సాగుచేసుకునే వీలు ఉండటంతో  ఇటు వైపునకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిందు సేద్యానికి  ఒక్కో యూనిట్‌కు  రూ. 5 వేల చొప్పున రైతులకు చెల్లిస్తుంది.  గతంలో  ప్రభుత్వం చెల్లించే ఈ సొమ్ము వ్యాట్‌కు జమయ్యేది  వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలపై జీఎస్టీని విధించే  ప్రభుత్వం పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను విస్మరిస్తుందని  అన్నదాతలు వాపోతున్నారు.  

దరఖాస్తుదారులందరికీ అందిస్తాం
జిల్లాలో బిందు సేద్యం పరికరాలను దరఖాస్తు చేసుకున్న ప్రతి  రైతుకు   పరికరాలను  అందిస్తాం.  పరికరాలపై ఇటీవల 18 శాతం జీఎస్టీ నుంచి  6శాతం తగ్గించి 12 శాతానికి  కుదించారు.  ఈఏడు సుమారు 900 మంది   రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 
–చక్రపాణి, ఉద్యానవన జిల్లా అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top