‘ఎస్సారెస్పీ’ నీటి విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌

Green Signal For SRSP Water Release In Warangal - Sakshi

రోజుకు రెండు వేల క్యూసెక్కులు... 

10 రోజుల వరకు సరఫరా

సాక్షి, వరంగల్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గతంలో ఈ అంశాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఎట్టకేలకు నీటి విడుదలకు గ్రీన్‌సిగ్న ల్‌ ఇచ్చింది. ఈమేరకు ఆదివారం 9 గంటలకు లోయర్‌ మానేరు డ్యాం(ఎల్‌ఎండీ) వద్ద నీరు విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజి నీర్‌ అనిల్‌కుమార్‌ ప్రకటించారు. త ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో 2,10,250 ఎకరాల్లో పంటలకు మేలు జరగనుంది. కాగా, దిగువ మానేరు కింద ఉన్న కొత్త 10 జిల్లాల్లో స్థిరీకరించిన ఆయకట్టు సుమారు 9 లక్షల ఎకరాల వరకు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎస్సారెస్పీ ద్వారా ఖరీఫ్‌ పంటలకు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. పాత వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు ఈ నీరు సరఫరా అవుతుంది. ఈ మేరకు ఖరీఫ్‌ చివరి దశలో ఉన్న పంటలకు ఉపయోగపడేలా చూడడంతో పాటు చెరువులు, కుంటలు నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్‌ఎండీ నీటి మ ట్టం 24.034 టీఎంసీలు కాగా, శనివారం నా టికి 20.543 టీఎంసీలకు చేరుకుంది. ఎల్‌ఎండీ ద్వారా ఆదివారం నుంచి రెండు వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేయనుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

నీటి విడుదల కార్యాచరణ ఇదీ.. 
ఎల్‌ఎండీ ఎగువ, దిగువన ఉన్న ఆయకట్టుతో పాటు చెరువులు, కుంటలు నింపడానికి ఈ నెల 13 నుంచి 23 వరకు ఎస్సారెస్పీ నీరు విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల్లో రబీ సీజన్‌ ఆరంభం కానుండగా.. ఇప్పటి నుంచే ప్రభుత్వం కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు రబీ సాగుకు ఎస్సారెస్పీ అధికారులు పంపిన సాగునీటి ప్రణాళికలను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇదే సమయంలో శ్రీరాంసాగర్‌కు 80 టీఎంసీల నీరు చేరుకోగా.. రోజుకు 6,060 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. ఎల్‌ఎండీలోకి 20.543 టీఎంసీల నీరు చేరడంతో నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు.

అధికారుల ప్రతిపాదనల ప్రకారం ఎల్‌ఎండీ దిగువన పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ఆయకట్టుకు పది రోజుల పాటు నీటి సరఫరా చేసేందుకు ఆదివారం విడుదల చేయనున్నారు. దీంతో వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధిలోని 2,10,250 ఎకరాల ఆయకట్టుకు మేలు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే వర్షాలతో చాలా చెరువులు, కుంటలకు నీరు చేరగా.. ఎల్‌ఎండీకి దిగువన ఉన్న కాల్వల ద్వారా జీవీసీ – 4 పరిధిలోని 439, వరంగల్‌(సీసీహెచ్‌) 154, స్టేజీ – 2 పరిధిలో 270 చెరువు కుంటలను పూర్తిగా నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రబీ సాగుకు ఎస్సారెస్పీ నీరు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 84 టీఎంసీల నీరు ఉంది. అయితే, ఇన్‌ ఫ్లో ఉండడంతో ఎల్‌ఎండీలోకి నీరు సమృద్ధిగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ స్టేజీ–1, 2 పరిధిలో రబీ సాగుకు నీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నుంచి చెరువులు, కుంటలు నింపనుండగా.. భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. మరోవైపు రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు ఇప్పటి నుంచే రైతులను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు 18.82 లక్షల ఎకరాలు కాగా, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 1,98,290 ఎకరాలకు రబీలో నీరందే అవకాశం ఉంది. 

నేడు దిగువకు విడుదల చేయనున్నాం..
దిగువ మానేరు ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఆదివారం నీటిని దిగువకు విడుదల చేయనున్నాం. స్టేజ్‌–1, 2 ద్వారా ఉదయం 9 గంటలకు నీటిని వదులుతాం. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఎక్కడ కాల్వవకు గండి పెట్టొద్దని కోరుతున్నాం. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే రబీ పంటలకు కూడా నీరు అందుతుంది. ఎల్‌ఎండీ నుంచి సూర్యాపేట వరకు చెరువులు, కుంటలు కూడా నింపనున్నాం. ఆదివారం ఉదయం 500 క్యూసెక్కులతో నీటిని విడుదల చేసి... సాయంత్రం వరకు రెండు వేల క్యూసెక్కులు పెంచుతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. 
– శ్రీనివాస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, జీవీసీ–4, ఎస్సారెస్పీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top