‘ఉపాధి’కి ఊతం

Grameena Upadi Hami Pathakam Dail Money Increase - Sakshi

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
 

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.

వ్యవసాయ ఆధారమే అధికం..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే ఎక్కువ. రెండో పంట లేకపోవడంతో కూలీలు ఇతర పనులు చేస్తూ ఏడాది పాటు కుటుంబాలను పోషించుకుంటారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు ఊపందుకున్నాయి. రోజురోజుకూ పనులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించిన అధికారులు అడిగిన వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 7,31,280 జాబ్‌ కార్డులు ఉండగా 16,67,339 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు.

పేదలకు వరం..
పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లా వాసులకు వరంగా మారిందని చెప్పవచ్చు. పనిదినాలు సైతం ఎక్కువగా ఉండటంతో నిధులు అధిక మొత్తంలో వస్తున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంపిక చేసి కూలీలకు పని కల్పించాల్సి ఉంటుంది. తద్వారా కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం.

ఏటా కూలీల బడ్జెట్‌ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధుల బలోపేతానికి, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బావులు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం, కందకాలు, ఊట కుంటలు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి తొట్లు, పండ్ల తోటల పెంపకం, నీటి నిల్వలకు సంబంధించిన పనులు, ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల నిర్మాణాలు చేపడుతున్నారు.

కనీసం 40 పనిదినాలు..
ఉపాధి పనుల్లో జాబ్‌ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పని దినాలు కల్పిస్తారు. ఒకరిద్దరు సభ్యులున్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం కోసం గ్రామపంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. వీటిలో పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని, వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

కూలి రేట్లు పెరగడం సంతోషకరం.. 
ఉపాధి హామీ పథకంలో కూలి రేట్లు పెరగడం సంతోషంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ పనులు లేక ఇంటి వద్దనే ఉండే వారికి ఉపాధి హామీ పథకం చాలా దోహదపడుతోంది. ఉపాధి దొరక్క వలస వెళ్లే వారికి స్థానికంగానే కొంత మెరుగైన ఆదాయం సమకూరనుంది. కూలి పెంచడం వల్ల చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. – కొన్కటి మోహన్, ధర్మరావుపేట, ఖానాపురం

ఏప్రిల్‌ 1 నుంచి అమలు
ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు పెరిగిన కూలి డబ్బులతో కలిపి రోజుకు రూ.211 చొప్పున ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది.  ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో రూ.6 పెంచారు. గతంలో రూ.205 కూలీ అందేది. అడిగిన కూలీందరికి ఉపాధి పథకం ద్వారా పనులు చూపిస్తున్నాం. ఎండాకాలంలో 30శాతం అధికంగా కూలి కట్టిస్తున్నాం. – సంపత్‌రావు, డీఆర్డీఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top