కృష్ణా నదీ జలాల వివాదాలపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాలపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ భేటీ ఈ నెల 21న నిర్వహించాలంటూ గురువారం కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి ఫోన్‌లో మాట్లాడి భేటీ తేదీలపై వివరణ ఇచ్చారు. దీనిపై కేంద్ర మంత్రితో మాట్లాడి స్పష్టత ఇస్తామని అమర్‌జీత్ వెల్లడించినట్లు తెలిసింది.
మరోవైపు అపెక్స్ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్రం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు, నీటి వినియోగంలో ఏపీ ఉల్లంఘనలపై లోతుగా పరిశీలన చేస్తోంది. భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎస్‌కే జోషి గురువారం అధికారులతో సమీక్షించారు. కృష్ణా జలాల్లో ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల వాటా, జరిగిన కేటాయింపులు, వినియోగం, పట్టిసీమ ద్వారా ఏపీ వినియోగం, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా తీసుకెళ్లిన అదనపు జలాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.
టెలీమెట్రీతో పరిష్కారం..: కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉం డాలంటే నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ విధానాన్ని అమల్లోకి తేవాలని తెలంగాణ అం టోంది. ఇప్పటికే కృష్ణా బోర్డు సూచించిన 47 చోట్ల టెలీమెట్రీ విధానం అమలు చేయాలని కోరుతోంది. బోర్డు సూచించిన జూరాలతోపాటు భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఆఫ్‌టేక్, జూరాల ఎడమ, కుడి కాల్వలు, తుంగభద్ర నదిపై ఆర్డీఎస్, కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం వద్ద ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, హంద్రీనీవా, ముచుమర్రి, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు, సోమశిల, సాగర్‌లో ఎన్‌ఎస్‌ఎల్‌సీ, ఏఎంఆర్‌పీ, ఎన్‌ఎస్‌ఆర్‌సీ, పులిచింతల స్లూయిస్, పవర్‌హౌజ్, మూసీ, పాలేరు, మున్నేరు నదీ ప్రాంతాలు, గుంటూరు చానల్, ప్రకాశం బ్యారేజీ వద్ద వాటిని ఏర్పాటు చేయాలని కోరుతోంది.