
కంటి వెలుగుపై గవర్నర్‌కు వివరిస్తున్న శాంతికుమారి, వాకాటి కరుణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఈ నెల15 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు పథకంపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆరా తీశారు. ఈ పథకం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి కంటి వెలుగు పథకం గురించి వివరించారు. ‘అంధత్వ రహిత తెలంగాణ’దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగని వారు వివరించారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు చేశాక అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ, ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. సాధారణ కంటి వ్యాధులున్న వారికి ఉచిత మందులను అందిస్తామన్నారు.