బాదేపల్లి కాదు.. జడ్చర్ల

The Government Issued Orders to Change the Name of Badepally to Jadcherla - Sakshi

బాదేపల్లి పురపాలికను పేరు మారుస్తూ ఉత్తర్వులు 

బ్యాంకు లావాదేవీలతో పాటు అన్ని వ్యవహారాల్లోనూ కొనసాగింపు 

జడ్చర్ల టౌన్‌: బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కె.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మున్సిపాలిటీ కమిషనర్‌ సునీత గురువారం విలేకరులకు తెలియజేశారు. బాదేపల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల మేజర్‌ గ్రామపంచాయతీ, బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామపంచాయతీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. జనవరిలో బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామాలు బాదేపల్లిలో విలీనం కాగా జడ్చర్ల మేజర్‌గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు మరో 2021 డిసెంబర్‌ వరకు ఉండటంతో విలీనం నిలిచిపోయింది. ఈ కారణంగా ఇప్పటి వరకు మున్సిపాలిటీ పేరు బాదేపల్లి పేరునే కొనసాగుతూ వచ్చింది. ప్రజల్లో సందేహాలు ఉండటంతో బాదేపల్లి మున్సిపాలిటీ పేరును జడ్చర్లగా మార్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శ్రీదేవి పేరు మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019 ప్రకారం పేరును మార్చారు. ఇకపై జడ్చర్ల మున్సిపాలిటీగా కొనసాగనుంది. బ్యాంకు లావాదేవీలతోపాటు అన్ని వ్యవహారాల్లోనూ పేరు మార్పుచేసుకోవాలని కమిషనర్‌కు ఉత్తర్వులో సూచించారు.
 
2012నుంచి దోబూచులాట.. 
మున్సిపాలిటీ విషయంలో 2012నుంచి దోబూచులాట కొనసాగుతూనే ఉంది. 2012 జనవరిలో బాదేపల్లి, జడ్చర్ల మేజర్‌గ్రామపంచాయతీలను జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే జడ్చర్ల గ్రామపంచాయతీకి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించగా జడ్చర్లను గ్రామపంచాయతీగా కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత బాదేపల్లిని సైతం గ్రామపంచాయతీగా మార్చారు. 2014 జూన్‌లో తిరిగి బాదేపల్లిని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే క్రమంలో 2016 డిసెంబర్‌లో జడ్చర్ల గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగగా బాదేపల్లి మున్సిపాలిటీ కొనసాగుతూ వచ్చింది. గతేడాది మేలో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం సమీప గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయగా బాదేపల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాలలను కలిపారు. అయినప్పటికి బాదేపల్లి పేరు కొనసాగింది. జడ్చర్ల విలీనానికి మరో ఏడాది గడువు ఉండగానే బాదేపల్లి పేరు మారుస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం.  

మార్పు చేస్తున్నాం 
బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్లగా మారుస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బాదేపల్లిని జడ్చర్లగా మార్పు చేస్తున్నాం. రికార్డులతో పాటు కార్యాలయ బోర్డులు అన్నీ శుక్రవారం నుంచి జడ్చర్లగానే వ్యవహరించబడతాయి.  – సునీత, కమిషనర్, మున్సిపాలిటీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top