ఆరుబయట నరకయాతన

Government General Hospital In Nalgonda - Sakshi

నల్లగొండ టౌన్‌ : జిల్లా కేంద్రాస్పత్రిలో రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులతో నిర్మించారు. కానీ రోగులవెంట వచ్చే సహాయకుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా నివారించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సకల సదుపాయాలతో 150 పడకల సామర్థ్యంగల ఎంసీహెచ్‌ను నిర్మించారు. రోజూ 300 నుంచి 500 వరకు గర్భిణులు ఓపి సేవలు పొందుతున్నారు. ప్రసవాల కోసం జిల్లా నలుమూలలనుంచి సమారు  100 నుంచి 150 మంది గర్భిణులు ఇన్‌పేషంట్‌లుగా చేరుతున్నారు. ఇంతటి తాకిడి ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి రోగులవెంట వచ్చే సహాయకులకు కనీస సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

సహాయకుల కోసం గతంలో తడకలతో షెడ్డును నిర్మించారు. ఆది కాస్త గాలికి కూలిపోవడంతో ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది. ఎంసీహెచ్‌లో గర్భిణుల సహాయం కోసం ఒక్కరిని మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. మిగిలిన వారంతా ఉదయం, రాత్రి పూట ఆరుబయట ఎండకు, చలికి ఇబ్బందులు పడాల్సిందే.  కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతులు లేకపోవడం వలన నేలపై, బెంచీలపై నిద్రించాల్సి వస్తుందని పలువురు సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరుబయటే ఎండకు కూర్చుని భోజనం చేయాల్సి వస్తుందని, కనీసం  తాగడానికి తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి  కోనుక్కుంటున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన నీటిట్యాంకు చిన్నది కావడంతో సహయకుల వాడకానికే సరిపోతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంసీహెచ్‌ను నిర్మించిన పాలకులకు కనీసం సహాయకుల కోసం  విశ్రాంతి షెడ్డును నిర్మించాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే షెడ్డును నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

చలికి వణికి పోతున్నాం
లోపల పడుకోనివ్వకపోవడంతో ఆరుబయటే నిద్రిస్తున్నాం. చలికి వణికిపోతున్నాం,. కనీసం ఉండడానికి షెడ్డు కూడా లేకపోవడం అన్యాయం. గర్భిణులకు సహాయంగా వచ్చిన వారు ఎక్కడ ఉండాలి. –  పుల్లమ్మ, నార్కట్‌పల్లి
తాగునీరు కొనాల్సి వస్తుంది

కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం దారునం. రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కొనుక్కుంటున్నాం. పడుకోవడానికి, కూర్చోవడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – యాదమ్మ, రాములబండ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top