శిశువును అమ్మేసిన గిరిజన దంపతులు
మళ్లీ అమ్మాయే పుట్టడంతో ఆడశిశువును విక్రయించిన దంపతులు
చెల్లెలిని ఇవ్వొద్దంటూ వారి కుమార్తెల రోదన
తిరుమలగిరి(నాగార్జునసాగర్): ఆడ శిశువు పుట్టిన పదిరోజులకే గిరిజన దంపతులు విక్రయించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం యల్లాపురంతండాకు చెందిన కొర్ర బాబు–పార్వతి దంపతులు నల్లగొండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పార్వతి మొదటి కాన్పు 2016లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మనీరు అధికంగా తాగడంతో పుట్టినబాబు అదే రోజున మృతిచెందాడు. ఆ తర్వాత పార్వతి రెండు, మూడు కాన్పుల్లోనూ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారసుడి కోసం పార్వతి నాలుగోసారి గర్భం దాల్చింది.
పది రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించగా.. మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయితే ముగ్గురు ఆడపిల్లలను సాకలేమని భావించిన ఆ దంపతులు ఆ శిశువు అమ్మకానికి సిద్ధమయ్యారు. మధ్యవర్తుల ద్వారా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన దంపతులకు ఆడశిశువును రూ.3 లక్షలకు రెండు రోజుల క్రితం విక్రయించారు. బాబు–పార్వతి దంపతులు శిశువును విక్రయిస్తుండగా.. వారి కుమార్తెలు చెల్లిని ఇవ్వొద్దంటూ గుక్కపట్టి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అమ్మా, నాన్న చెల్లిని ఇవ్వకండి అంటూ ఏడుస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. ఆ తర్వాత పార్వతి తన పుట్టినిల్లు పెద్దవూర మండలం ఊరబావితండాకు వెళ్లింది. శిశువుని విక్రయించిన విషయం కొర్ర బాబు అన్న సురేశ్‌నాయక్‌కు తెలియడంతో ఆ చిన్నారిని మనమే సాకుదామని విక్రయించిన శిశువును తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే విషయం అంగన్‌వాడీ అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు వారి ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు.


