అద్దె ఎప్పుడిస్తరు? | Government Fails To Clear Vehicle Hire Bills In Kamareddy | Sakshi
Sakshi News home page

అద్దె ఎప్పుడిస్తరు?

Sep 16 2019 9:48 AM | Updated on Sep 16 2019 9:48 AM

Government Fails To Clear Vehicle Hire Bills In Kamareddy - Sakshi

కలెక్టరేట్‌ వద్ద నిలిపిన ఆయా శాఖల అధికారులకు కేటాయించిన అద్దె వాహనాలు

ప్రభుత్వ శాఖల్లో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వాహనాలకు సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడెనిమిది నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వాహనాల యజమానులు ఇబ్బందిపడుతున్నారు.

సాక్షి, కామారెడ్డి: సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖ సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనల నిమిత్తం వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ట్యాక్సీ రిజిస్ట్రేషన్‌ ఉన్న ప్రైవేట్‌ వాహనాలనే అద్దెకు తీసుకోవాలి. పెట్రోలు, డ్రైవరు బత్తా, మెయింటెనెన్స్‌ చార్జీలు, ఇతర చెల్లింపులను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో అద్దె వాహనాలను పెట్టుకోవడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈ పద్ధతిలో ఉపాధి పొందేందుకు ఎంతో మంది కార్లను కొనుగోలు చేసి జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారుల వద్ద అద్దెకు నడుపుతున్నారు. ప్రతినెలా ఖర్చులుపోనూ వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లాలో వందకు పైగా అద్దె వాహనాలు ఆయా ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్నాయి. అయితే ఉపాధి మాటేమో కానీ బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని వాహనాల యజమానులు పేర్కొంటున్నారు. ఆరు నెలలనుంచి ఏడాదివరకు బిల్లులురావాల్సి ఉందంటున్నారు.

లక్షల్లో పెండింగ్‌ 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు గుర్తింపు పొందిన అద్దె వాహనాలను నెలవారీగా అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె వాహనానికి నిబంధనల ప్రకారం నెలకు రూ.33 వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కలెక్టరేట్‌లోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల వద్ద, డివిజన్, మండలస్థాయి అధికారుల వద్ద అద్దె వాహనాలు పనిచేస్తున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో 13, ఆర్‌డబ్ల్యూఎస్‌లో 6, డీఆర్‌డీఏలో 8, ఆర్‌అండ్‌బీలో 5, పంచాయితీరాజ్‌లో 6, వైద్యశాఖలో 16 అద్దె వాహనాలతో పాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం వందకుపైగా అద్దె వాహనాలున్నాయి.

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో నడుస్తున్న ఆరు వాహనాలకు పది నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. ఎక్సైజ్‌శాఖలో ఉన్న 13 అద్దె వాహనాలకు మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. డీఆర్‌డీఏలో 8 వాహనాలకు 5 నెలల బిల్లులు, ఆర్‌అండ్‌బీలోని 5 వాహనాలకు 6 నెలల బిల్లులు రావాల్సి ఉంది. వైద్యశాఖలోని 16 వాహనాలకు 6 నెలలుగా, పంచాయతీరాజ్‌లోని 6 వాహనాలకు 6 నెలలుగా బిల్లులు మంజూరు కాలేదు. మైనారిటీ శాఖలో పనిచేస్తున్న ఓ వాహనానికి ఏకంగా 15 నెలలుగా అద్దె చెల్లించడం లేదు.

అప్పుల పాలవుతున్న యజమానులు
ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాలను సమకూరుస్తున్న వారే డీజిల్‌ పోయించాల్సి ఉంటుంది. ప్రతి నెల 2 వేల కిలోమీటర్ల వరకు వాహనాన్ని నడపాలి. వాహనాల సర్వీసింగ్‌ వాళ్లే చేయించుకోవాలి. ప్రతినెలా బిల్లులు సకాలంలో వస్తేనే డీజిల్, సర్వీసింగ్, మైనర్‌ రిపేర్లకు ఇబ్బందులు ఉండవు. కానీ నెలల తరబడిగా బిల్లులు రాకపోవడంతో వారు వాహనాన్ని నడిపేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. వాహనాల రుణ వాయిదాలను చెల్లించలేకపోతున్నామని, వాహనాన్ని నడిపేందుకే అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

15 నెలలుగా రాలేదు
మైనారిటీ సంక్షేమ శాఖకు అద్దె ప్రాతిపదికపై వాహనం సమకూర్చాను. 15 నెలలుగా వాహనం నడుపుతున్నాను. ఇప్పటికీ ఒక్క రూపాయి రాలేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి బిల్లులు ఇప్పించాలి.  
– వెంకటసాయి, అద్దె వాహనం యజమాని

అధికారులు స్పందించాలి 
జిల్లాలో ప్రభుత్వ శాఖలలో నడుస్తున్న అద్దె వాహనాలకు నెలల తరబడిగా బిల్లులు రావడం లేదు. బిల్లుల చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. బిల్లులు ఇవ్వాలని అధికారులను చాలాసార్లు కోరాం. కానీ వస్తాయంటున్నారే కానీ నెలలు గడుస్తున్నా ఇప్పించడం లేదు. వెంటనే బకాయిలను ఇప్పించాలి.
– రాజాగౌడ్, తెలంగాణ ఫోర్‌వీలర్స్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్, జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement