సమ్మె యోచనలో ప్రభుత్వ వైద్యులు

Government doctors are planning to strike - Sakshi

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన

పదోన్నతులకు శ్రీకారం చుట్టలేదని మండిపాటు

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి వినతి 

సాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు సర్కారుకు విన్నవిస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో తాత్సారం కనిపిస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా çసమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి.నరహరి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.సుధాకర్‌ తదితరులు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు. ఒకట్రెండు రోజుల్లో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. నిర్ణీత కాలంలో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు. నిర్ణీత కాలంలోనే వైద్యులకు ఆటోమేటిక్‌గా పదోన్నతులు లభించేలా జారీచేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలుకావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

వారి డిమాండ్లు ఇవే..
- 2016లో యూజీసీ ఇచ్చిన వేతన స్కేల్‌ను అమలు చేయాలి. అప్పటినుంచి ఇప్పటివరకు సంబంధిత బకాయిలు చెల్లించాలి. 
పీజీ వైద్య విద్యను మరింత బలోపేతం చేయాలి. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేయడం కోసం నాన్‌ క్లినికల్, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఫ్యాకల్టీని నియమించాలి. 
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి. 
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో తక్షణమే పదోన్నతులు ఇవ్వాలి. 
వైద్య విధాన పరిషత్‌ వైద్య ఉద్యోగులకు ట్రెజరరీ వేతనాలు అందజేయాలి. 
వైద్య విధాన పరిషత్‌లో ఉన్న వైద్యులందరికీ ఆరోగ్య కార్డులు అందజేయాలి. 
ఆసుపత్రుల మధ్య సరైన పర్యవేక్షణ నిమిత్తం 33 జిల్లాల్లో డీసీహెచ్‌ఎస్‌ పోస్టులను సృష్టించాలి. 
ఎంసీహెచ్‌ ఆసుపత్రుల కోసం అదనంగా ఒక మెడికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టును మంజూరు చేయాలి. 
కేసీఆర్‌ కిట్‌ అమలు చేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 
వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ పోస్టును విధిగా సీనియర్‌ వైద్యునికే ఇవ్వాలి. 
పీజీ ప్రవేశాల్లో సర్వీసు కోటాను పునరుద్ధరించాలి. 
ప్రసవాల కేసులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి. 
2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ స్కీం బదులు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి. 
మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులో వివిధ వైద్య విభాగాల అధిపతులను చేర్చాలి. 
బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్టాఫ్‌ నర్సుల పోస్టులను భర్తీ చేయాలి. 
జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అధ్యాపకులు వెళ్లని పరిస్థితుల నేపథ్యంలో బేసిక్‌ వేతనంలో 40 శాతం అదనంగా ప్రోత్సాహకం ఇవ్వాలి. 
ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో అదనపు సంచాలకులకు పదోన్నతులు ఇవ్వాలి. సీనియర్‌ వైద్యాధికారిని డైరెక్టర్‌గా నియమించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top