మెతుకుసీమ యంత్రాంగం ‘కునుకు’తీస్తోంది. ఫలితంగా జిల్లాలో పాలన పడకేసింది. ఒక్క పనీ సరిగా సాగడం లేదు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మెతుకుసీమ యంత్రాంగం ‘కునుకు’తీస్తోంది. ఫలితంగా జిల్లాలో పాలన పడకేసింది. ఒక్క పనీ సరిగా సాగడం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలకు అధికారులకు మధ్య అంతరం పెరుగుతోంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గట్టిగా అదిలించి చేయిస్తున్నవి తప్ప మిగతావన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి. జిల్లాలోని రెవెన్యూ, పంచాయితీ తదితర అన్ని ముఖ్య విభాగాల్లో కలిపి దాదాపు 3 లక్షల అర్జీలు, వేల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలు రైతులకు ఇవ్వాల్సిన భూ పట్టాదారు పాసు పుస్తకాల వరకు జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
అధికారుల ఇష్టారాజ్యంతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలు మందగిస్తోంది. ఏ విభాగం చూసినా అధికారిక నివేదికలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతనే ఉండటం లేదు. గతంలో అధికారులు భయానికో, భక్తికో దివగస్థాయి ప్రజా ప్రతినిధుల ఫోన్‌కాల్స్‌ను ఎత్తి ఫిర్యాదులు స్వీకరించే వారు. కానీ ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల కాల్స్ తప్పితే మిగిలిన వారిని అసలు లెక్కే చేయడం లేదన్న విమర్శలున్నాయి.
ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్తారో..
జిల్లా అత్యున్నత స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయి అధికారులే.. అంటే, వారంలో కనీసం రెండు, మూడుసార్లు పల్లెలకు వెళ్లి ప్రజల గోడు వినాలి. వారి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలి. కానీ అధికార యాంత్రాంగం ప్రజలకు దూరంగా గడుపుతోంది. సమస్యలను చెప్పుకోవడం కోసం జనం కలెక్టరేట్‌కు వచ్చినా ‘సార్లు’ దొరకటం లేదు. పోనీ కార్యాలయంలో ఉంటున్నారా? అంటే అదీ లేదు. జిల్లా ఉన్నతాధికారులంతా హైదరాబాద్‌లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖల అధికారులంతా తమ సమయ పాలనను ‘అత్యున్నత స్థాయి అధికారి’ దిన చర్యతో సెట్ చేసుకున్నారు. ఆయన రాకకు పావుగంట ముందు, ఆయన వెళ్లిన పావుగంట తరువాత వచ్చివెళ్లిపోతున్నారు. దీంతో ముఖ్య అధికారులు కార్యాలయంలో గడిపే సమయం 3-4 గంటలకు మించటం లేదు.
అంతా ఓకే అంటూ లేఖలు!
గ్రీవెన్స్ సెల్ దాదాపు నిర్వీర్యమైపోయింది. ఉన్నతాధికారులు గ్రీవెన్స్‌కు.. దిగువ స్థాయి సిబ్బందిని పంపుతున్నారు. ప్రజావాణి ద్వారా ఈ ఐదేళ్లలో 5552 ఫిర్యాదులు రాగా.. అన్నీ పరిష్కరించినట్లు, 178 మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికల్లో పొందుపరిచారు. సమస్యకు పరిష్కారం చూపకుండానే ‘మీ సమస్య పరిష్కరించడమైనది’ అంటూ ఉత్తరాలు పంపుతుండటం ప్రజలను విస్మయపరుస్తోంది.
జవాబుదారీతనం లేని పర్యటనలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అత్యున్నత, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటి వరకు 200 సార్లు పర్యటించారు. అక్కడికి వెళ్లిన ప్రతి అధికారి ‘గడా’ ఓఎస్‌డీ ఇచ్చిన నివేదికలను చూడటంతోనే సరిపెడుతున్నారు. వారికి ప్రజ ల్లోకి వె ళ్లాలనే ఆలోచనే రావట్లేదు. సీఎం రూ.3వేల కోట్లకుపైగా నిధులు తన నియోజకవర్గానికి గుమ్మరించారు. కానీ జరుగుతున్న పనులను వేళ్లపై లెక్కించవచ్చు. ఇక్కడే ఇలా ఉంటే సాధారణ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
అధికారుల నిర్లక్ష్యంతోనే గజ్వేల్ నియోజకవర్గంలో రైతు, సాధారణ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇక, ఈ సీజన్‌లో పాముకాటు మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. పాముకాటు మందులు అన్ని ఆసుపత్రిల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నా.. బాధితులు చికిత్సకు వెళ్తుంటే వైద్యులు చేతులెత్తేస్తున్నారు. కల్తీ విత్తనాలు కూడా గజ్వేల్‌లోనే ఎక్కువగా పట్టుపడుతున్నాయి.