షైన్‌ టెయిన్‌..

GHMC Focus on Fountains Repair in Hyderabad - Sakshi

65 ఫౌంటెయిన్లకు కొత్తందాలు  

ఆధునికీకరణపై జీహెచ్‌ఎంసీ దృష్టి  

తొలి దశలో 24 ప్రాంతాల్లో పనులు  

అంచనా వ్యయం రూ.25 లక్షలు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లు ఎన్నో ఉన్నాయి. అయితే నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో చాలా వరకు పాడైపోయాయి. రెండేళ్ల క్రితం తెలుగు మహాసభల సందర్భంగా వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలనుకున్నారు. ప్రధాన మార్గాల్లోని కొన్నింటికి తాత్కాలికంగా మరమ్మతులు చేసినా, మళ్లీ నిర్వహణ లోపంతో అందం మూణ్నాళ్ల చందమే అయింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలోని జంక్షన్లను ప్రత్యేక థీమ్‌లతో తీర్చిదిద్దిన జీహెచ్‌ఎంసీ అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగం... ఇప్పుడు ఫౌంటెయిన్లపై దృష్టిసారించింది. వీటిని ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులకు కనువిందుగా ఉంటుందని భావించి ప్రతిపాదనలు రూపొందించగా, కమిషనర్‌ ఆమోదించడంతో పనులు చేపట్టింది. 

ఏజెన్సీకే ఏడాది నిర్వహణ...  
నగరవ్యాప్తంగా మొత్తం 65 ఫౌంటెయిన్లను గుర్తించి ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో 35 ప్రధాన రహదారుల మార్గాల్లోని జంక్షన్లు, ఫ్లైఓవర్ల దిగువన ఉండగా... మిగతా 30 పార్కుల్లో ఉన్నాయి. తొలుత ప్రధాన రహదారుల మార్గాల్లోని ఫౌంటెయిన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. వాటిలోనూ ముఖ్యమైనవిగా భావించే 24 ప్రాంతాల్లో ముందుగా మరమ్మతులు చేసి, లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, ఇందుకు దాదాపు రూ.25 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటిలో కేవలం రూ.50 వేలు మాత్రమే వ్యయమయ్యే వాటితో పాటు రూ.లక్షకు పైగా నిధులు వెచ్చించాల్సినవీ ఉన్నాయి. ఫౌంటెయిన్‌ను ఆధునికీకరించి వినియోగంలోకి తెచ్చినా తిరిగి పాతకథ పునరావృతం కాకుండా ఉండేందుకు... పనులు చేపట్టేందుకు ముందుకొచ్చే కాంట్రాక్టు ఏజెన్సీనే ఏడాది పాటు నిర్వహణ కూడా చూసుకునేలా నిబంధన విధించారు. ఇప్పటికే వీటి పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయి. జనవరిలోగా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తవుతాయని అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ వి.కృష్ణ తెలిపారు. వీటి పనులు పూర్తయ్యాక పార్కుల్లోని పౌంటెయిన్లను మలి దశలో ఆధునికీకరిస్తామన్నారు.

పనులు చేపట్టిన ప్రాంతాలివీ...
గుల్జార్‌హౌస్, మాసబ్‌ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ కింద, ఫ్లెమింగోస్‌ ఫౌంటెయిన్‌ (మాసబ్‌ట్యాంక్‌ జంక్షన్‌), బీఆర్‌కే విగ్రహం, మాధవరెడ్డి విగ్రహం, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్, బాబూజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్, గన్‌పార్క్, బర్కత్‌పురా త్రీక్రేన్‌ ఫౌంటెయిన్, నారాయణగూడ ఫ్లైఓవర్, విశ్వేశ్వరయ్య విగ్రహం (ఖైరతాబాద్‌), రాజ్‌భవన్‌రోడ్‌(సెంట్రల్‌ మీడియన్‌), రాజీవ్‌ ఐలాండ్, సోమాజిగూడ క్రాస్‌రోడ్స్, ఎస్సార్‌నగర్‌ క్రాస్‌రోడ్స్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ (బంజారాహిల్స్‌), బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌.12 జంక్షన్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, శతధార వాటర్‌ఫాల్స్‌ (ఖైరతాబాద్‌ జంక్షన్‌), మంజీరా గెస్ట్‌హౌస్, ఎల్‌వీ ప్రసాద్‌ విగ్రహం, కేబీఆర్‌ సెంట్రల్‌ మీడియన్స్, హరిహర కళాభవన్‌ ఫ్లైఓవర్, మహాత్మాగాంధీ విగ్రహం, ఎంజీరోడ్‌.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top