
ఘట్‌కేసర్-పెద్ద అంబర్‌పేట ‘ఔటర్’ రెడీ
ఘట్‌కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గంలోని 14 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.
- సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం
- వరంగల్- విజయవాడ హైవేలకు అనుసంధానం
- ప్రధాన రోడ్డుకు మెరుగులద్దుతున్న హెచ్‌ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో: ఘట్‌కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గంలోని 14 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మార్గాన్ని అధికారికంగా ప్రారంభించి వాహనాల రాకపోకలను అనుమతించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తారామతిపేట, ఘట్‌కేసర్ జంక్షన్లలో విద్యుత్ లైటింగ్, సైనేజ్ బోర్డుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన రహదారిపైకి జంతువులు రాకుండా రోడ్డు అంచుల్లో చెయిన్ లింక్ మెష్‌ను బిగిస్తున్నారు. పనుల్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేసిన తరువాతే ముఖ్యమంత్రిని కలిసి ప్రారంభ తేదీని ఖరారు చేయాలని భావిస్తున్నారు.
అయితే, ఘట్‌కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గంలో సర్వీసుల రోడ్లు, ఇతర నిర్మాణాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున నిర్మాణం పూర్తి చేసుకున్న 14 కి.మీ. మేర ప్రధాన రహదారిని వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్ నిర్ణయించారు. గత మార్చిలోనే ఈ మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించాలని భావించారు. పలుచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోవడంతో పాటు సాధారణ ఎన్నికలు రావడంతో ప్రారంభాన్ని వాయిదా వేశారు.
ప్రధాన హైవేలకు అనుసంధానం
14 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తుండటంతో ప్రధానంగా వరంగల్ హైవేకు విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఘట్‌కేసర్ జం క్షన్ వద్ద ఔటర్ పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్ద అంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకోవచ్చు.
ముఖ్యంగా వరంగల్- విజయవాడ, వరంగల్- బెంగళూరు, వరంగల్- ముంబై ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం వరంగల్ నుం చి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ మీదుగా నాగో లు, ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ గుండా పెద్ద అంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-9)ని చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఔటర్ అందుబాటులోకి రావడంతో ఇక పై నగరంలోకి రాకుండా ఊరు బయ ట నుంచే ఆయా ప్రధాన రహదారులకు చేరుకుంటాయి.
ప్రస్తుతం ఘట్‌కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డుకు గాను 21.4 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. ఇంకా కండ్లకోయ జంక్షన్ వద్ద 1.1 కి.మీ. శామీర్‌పేట- కీసర (10.3కి.మీ), కీసర-ఘట్‌కేసర్ (10కి.మీ) రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఘట్‌కేసర్ వద్ద జరుగుతున్న ఆర్వోబీ పనులను కూడా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఘట్‌కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా 2015 జనవరి నాటికి పూర్తిచేయాలని నిర్దేశించారు.
నిలిచిపోయిన శామీర్‌పేట-కీసర మార్గానికి రూ.190 కోట్ల వ్యయ అంచనాతో ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ పనులను వచ్చే 15 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, ప్రధాన మార్గాన్ని (మెయిన్ క్యారేజ్) మాత్రం వచ్చే 7 నెలల్లోనే పూర్తి చేయాలన్నది లక్ష్యమని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.