సిలిం'డర్‌'!

Gas Cylinder Blast in Kapra Hyderabad - Sakshi

తరచుగా ‘గ్యాస్‌’ ప్రమాదాలు అవగాహన లేమి వల్లే అసలు సమస్య

కాప్రా ఉదంతంతో తీవ్రకలకలం

భారీగా చోటు చేసుకున్న ఆస్తినష్టం

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులకు సిలిం‘డర్‌’ పట్టుకుంటోంది... ఇటీవల కాలంలో తరచుగా ‘గ్యాస్‌’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి...గడిచిన రెండు నెలల్లోనే ‘గ్యాస్‌ బాంబ్‌’కు పలువురు బలయ్యారు. గత ఏడాది నవంబర్‌ 9న కొత్తగూడ షాగౌస్‌ హోటల్‌లో, డిసెంబర్‌ 27న ఫిల్మ్‌నగర్‌ పరిధిలోని బసవతారకానగర్‌లో, శుక్రవారం కాప్రా పరిధిలో గ్యాస్‌ సిలిండర్లు బీభత్సం సృష్టించాయి. ఏడాదికి 40 నుంచి 50 వరకు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా... ఆస్తి నష్టం మాత్రం భారీగా చోటు చేసుకుంటోంది. గ్యాస్‌ వినియోగంపై వినియోగదారులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. 

ఏమిటీ గ్యాస్‌ సిలిండర్‌...  
గ్యాస్‌ సిలిండర్‌... ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే నిత్యావసర వస్తువు. మన వంటింట్లో ఉండే సిలిండర్‌లో బ్యూటేన్, ప్రొఫైన్‌ అనే రసాయిన వాయువులు కలిసి ఉంటాయి. ఎలాంటి వాసన ఉండని సహజవాయువుకు దానికోసం మరŠాక్యప్టెయిన్‌( కెమికల్‌)ను కలుపుతారు. దాదాపు 14.5 కేజీల బరువున్న ఈ వాయువులను అత్యధిక ఒత్తిడితో గ్యాస్‌ సిలిండర్‌లో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. 

ఏడు చోట్ల లీక్‌కు చాన్స్‌...
సాధారణంగా స్టౌవ్‌ ఆఫ్‌ చేసి ఉన్నప్పటికీ... గ్యాస్‌ లీకేజ్‌ అనేది ఏడు ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. సిలిండర్, స్టౌవ్‌లను కలుపుతూ రబ్బర్‌ ట్యూబ్‌ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌవ్‌కు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్‌ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంతం రంధ్ర ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్‌ లీక్‌ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది. మరోపక్క స్టౌవ్‌కు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్‌ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్‌ నాబ్‌ల నుంచీ లీక్‌ అయ్యే అవకాశం ఉంది. 

‘తెరిచి ఉన్నా’ ఫలితం నిల్‌...
వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్‌ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు  తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. 

అగ్నికి ప్రేరణలు ఎన్నో...
లీకైన గ్యాస్‌ అంటుకోవడానికి అనేక రకాలుగా ప్రేరణలు ఉంటాయి. గ్యాస్‌ వ్యాపించి ఉన్న గదిలో లైట్‌ వేసినా, అగ్గిపుల్ల, లైటర్‌ వెలిగించినా, ఏదైనా బరువైన వస్తువు ఎత్తుమీద నుంచి కిందపడినా వచ్చే స్పార్క్‌ వల్ల అంటుకుంటుంది. మరోపక్క మన ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లు కూడా గ్యాస్‌ మండటానికి ప్రేరణలుగానే పని చేస్తాయి. ఫ్రిజ్‌లో కూలింగ్‌ పెరిగినప్పుడు ఆగిపోయి, తగ్గిన వెంటనే మళ్లీ స్టార్ట్‌ అయ్యే పరి/ê్ఞనం ఉంటుంది. దీన్నే రిలే మెకానిజం అంటారు. ఇలా రిలే జరిగేటప్పుడు ఫ్రిజ్‌ నుంచి ‘టక్‌’ మనే శబ్దం వస్తుంది. అందులో ఉత్పన్నమయ్యే స్పార్క్‌ వల్లే ఈ శబ్దం వెలువడేది. ఇంట్లో వ్యాపించిన గ్యాస్‌ దీనివల్లా అంటుకునే ప్రమాదం ఉంది.

12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది...
ఇల్లంతా వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్‌ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్‌ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్‌ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. తలుపులు, కిటికీలతో పాటు కాస్త బలహీనంగా ఉన్న గోడలు సైతం విరిగిపోతాయి. ఒక్కసారిగా గ్యాస్‌ అంటుకుని ఆరిపోవడం వల్ల భారీ ఆగ్నిప్రమాదం సైతం సంభవించదు. అయితే ఆ సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 50 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. కెమికల్‌ ఎక్స్‌ప్లోజన్‌గా పిలిచే ఈ ప్రమాదాల్లో సాధారణంగా గ్యాస్‌ సిలిండర్‌  చెదరదు. సిలిండర్‌ కూడా ఛిద్రం అయితే అది మెకానికల్‌ పేలుడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top