జెడ్పీకి గుడ్‌బై..

Gadipalli Kavitha  ZP Chairperson  Resignation Khammam - Sakshi

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి గడిపల్లి రాజీనామా  

కలెక్టర్‌కు రాజీనామా పత్రం అందజేసిన కవిత  

వైస్‌ చైర్మన్‌ బరపటి వాసును చైర్మన్‌ పదవి వరించేనా..!?

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2014 ఆగస్టు 7వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఆమె సుమారు 54 నెలలపాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కవిత రాజీనామా జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె గతంలో కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పోటీ చేసి ఓటమి చెందారు.

టీడీపీలో ఉన్నంతకాలం తుమ్మల అనుచరురాలిగా ఉన్న కవిత.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం(ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) జెడ్పీటీసీగా గెలుపొందారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్‌ కావడంతో.. టీడీపీలో అప్పుడు కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో అనూహ్యంగా కవితను ఆ పదవి వరించింది. తన రాజకీయ గురువుగా భావించే తుమ్మల నాగేశ్వరరావుతోపాటే ఆమె 2014 సెప్టెంబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

మధిర ‘అసెంబ్లీ’పై ఆసక్తి చూపి.. 
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి ప్రదర్శించారు. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం లింగాల కమల్‌రాజుకు ఖరారైంది. శాసనసభ ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక తనకు రాజకీయ అండదండలు అందించిన వ్యక్తి ఓటమి చెందడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కవిత శనివారం తనను కలిసిన విలేకరులకు వివరించారు.

వెంకటాపురం జెడ్పీటీసీ పదవికి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి తాను రాజీనామా చేశానని, అయితే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఇక మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని రాజీనామా చేయడానికి రాజకీయ కారణాలతోపాటు కొన్ని వ్యక్తిగత కారణాలు సైతం ఉన్నాయని ఆమె వివరించారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి సాధారణ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌గా తనను ఆదరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పుడా పదవి ఎవరికి..? 
జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి కవిత ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరిని వరిస్తుంది..? ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీ వరకు జిల్లా పరిషత్‌ పాలక వర్గ పదవీ కాలం ఉంది. ఈలోపే జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి కవిత రాజీనామా చేయడంతో పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్న వారు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరఫున ఎన్నికై తుమ్మల నాగేశ్వరరావుతోపాటు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

తుమ్మల సన్నిహితుడిగా పేరొందిన బరపటి వాసుదేవరావును జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్‌ పదవీ కాలం ముగిసే లోపు చైర్మన్‌ రాజీనామా చేస్తే వైస్‌ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీనేనని.. అదే తరహా సంప్రదాయం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుపొందడంతో గడిపల్లి కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం లభించింది. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన సత్తాను చాటుకుంది. పలు కీలక మండలాల జెడ్పీటీసీ పదవులను కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ కొనసాగుతోంది.

మిగిలిన పదవీ కాలం రెండు నెలలే.. 
రెండునెలల్లో జిల్లా పరిషత్‌ పదవీకాలం ముగుస్తుండటంతో కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. వైస్‌ చైర్మన్‌కు చైర్మన్‌గా బా§ధ్యతలు అప్పగించే అవకాశం సైతం లేకపోలేదని చర్చ జరుగుతోంది. 2014లో 46 మండలాల జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరగ్గా.. రాష్ట్ర విభజన అనంతరం ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో 41 మండలాల జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లా పరిషత్‌లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ కలిగి ఉంది. 

వాసుకు చైర్మన్‌ గిరి దక్కేనా? 
పాల్వంచరూరల్‌: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేయడంతో వైస్‌ చైర్మన్‌కు ఆ పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు ప్రస్తుతం జెడ్పీ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. 2014లో పాల్వంచ జెడ్పీటీసీగా టీడీపీ నుంచి విజయం సాధించిన ఆయన తుమ్మల నాగేశ్వరరావుతోపాటే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. తుమ్మలకు సన్నిహితుడనే పేరు కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top