డెంగీ పరీక్షలన్నీ ఉచితం

Free Blood Test For Dengue Says Telangana Health Department - Sakshi

బోధనాస్పత్రులు, ఫీవర్‌ ఆసుపత్రి, ఐపీఎంలో ఉచితంగా పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్‌ ఫీవర్‌కు సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా చేయాలని స్పష్టంచేసింది. ఆయా ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో డెంగీ పరీక్షలు ఉచితమంటూ ప్రజలందరికీ కనిపించేలా బోర్డు లు కూడా ప్రదర్శించాలని సూచించింది. అన్ని చోట్లా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేయాలని, గంటకు మించి ఎవరూ వేచి చూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టంచేసింది. ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. వైద్యులు అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. 

ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్పుడు రిపోర్టులు... 
రాష్ట్రంలో డెంగీ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు డెంగీ ఉన్నా, లేకపోయినా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని.. ప్లేట్‌లెట్లు ఎక్కువగా ఉన్నా, తక్కువగా చూపిస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్లేట్‌లెట్ల గుర్తింపులో ప్రైవేటు ఆసుపత్రులు అనేక మతలబులు చేస్తున్నాయని సర్కారు గుర్తించింది. తప్పుడు రిపోర్టులు చూపించి దోపిడీ చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చింది. మరోవైపు ప్లేట్‌లెట్లు పడిపోయే తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య 20వేల లోపునకు పడిపోతేనే సమస్య పెరుగుతుందని.. అప్పుడే ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. కానీ పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్లేట్‌లెట్లు 50వేలకు పడిపోయినా ఐసీయూకు తరలించి చికిత్స చేసి లక్షలు గుంజుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వమే ఉచితంగా డెంగీ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది.   

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top