
సాక్షి, గౌతంనగర్: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ (76) ఇక లేరు. గురువారం రాత్రి తీవ్ర గుండె పోటుకు గురికావడంతో కుప్పకూలిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గత కొద్ది నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నెల 27న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఈ నెల 8న డిశ్చార్జి అయ్యి మల్కాజిగిరిలోని ఆయన నివాసంలో ఫిజియోథెరపీ చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత తీవ్ర గుండెపోటు వచ్చి.. ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ఆయనకు భార్య విద్యులత ఉన్నారు. సంతానం లేకపోవడంతో విద్యులత అక్క కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఆమోసు స్వగ్రామం నల్లగొండ జిల్లా కాగా.. పుట్టి పెరిగింది సికింద్రాబాద్ పద్మరావునగర్‌లో. 2005 నుంచి 2007 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా వ్యవహరించారు. 2007 నుంచి 2016 వరకు రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు.
సీఎం, మంత్రుల సంతాపం..
కే.ఆర్.ఆమోస్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమోస్ ప్రదర్శించిన స్ఫూర్తి, త్యాగనిరతిని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఆమోస్ మృతిపట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.