తన సమస్యను ఎన్ని సార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందిచలేదు. మరో వైపు నీళ్లు లేక పొలం ఎండిపోతోంది. దీంతో దిక్కుతోచని ఓ రైతు తహశీల్దార్ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు.
నల్లగొండ: తన సమస్యను ఎన్ని సార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందిచలేదు. మరో వైపు నీళ్లు లేక పొలం ఎండిపోతోంది. దీంతో దిక్కుతోచని ఓ రైతు తహశీల్దార్ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
మండల కేంద్రానికి చెందిన సంజీవ్‌రెడ్డి(55) వ్యవసాయ బోరు ఈ మధ్య కాలంలో ఎండిపోయింది. వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ పక్క పొలం వాళ్లు బోర్లు వేయడంవల్లే తన పొలంలోని బోరులో నీళ్లు అడుగంటి పోయాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంజీవ్ రెడ్డి పలు మార్లు తహశీల్దారుకు మొరపెట్టుకున్నాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగెత్తి.. తహశీల్ ఆఫీసులోనే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అప్పుడుగానీ స్పందించిన తహశీల్దారు తన కారులో అతడ్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు సంజీవ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.