విదేశీ జంట.. వినోదమంట

Foreign Couple Bike Tour In India - Sakshi

భారత్‌లో బైక్‌పై పర్యటన

నగరం నుంచి రోడ్‌ యాత్ర  

వ్యాపార పనుల నిమిత్తం సిటీకి వచ్చిన ఓ విదేశీ జంట.. భారత్‌లోని ప్రముఖ నగరాలను చుట్టేసింది. వారి ట్రిప్‌ విమానంలోనో, కారులోనో కాదు. బైక్‌పై సాగింది. అక్టోబర్‌ 11న నగరంలో ప్రారంభమైన వీరి రైడ్‌ 23న ముగిసింది. మట్టి రోడ్లపై ప్రయాణిస్తూ,ప్రజలతో మమేకమవుతూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలుసుకున్నారు మెక్సికో కపుల్‌ రౌల్‌ రిసెండిజ్, కారోలినా.

వివిధ దేశాలను చుట్టేసి... అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక విశేషాలు, ప్రజల అభిరుచులు తెలుసుకోవాలని కొంతమందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. పనిలో పనిగా ఆయా దేశాలు వెళ్లినప్పుడు సమయం కేటాయించి ఓ ట్రిప్‌వేసేస్తారు. అలా మెక్సికో నుంచి భారత్‌ వచ్చిన ఓ జంట బైక్‌పై ఇక్కడి ప్రదేశాలను చుట్టేసింది.

సాక్షి, సిటీబ్యూరో  :మెక్సికోకు చెందిన పారిశ్రామికవేత్త రౌల్‌ రిసెండిజ్, కారోలినా దంపతులు. వీరు మెక్సికోలోని క్యాండీస్‌ ఐస్‌క్రీమ్‌ సంస్థ యజమానులు. వీరికి ఏడుగురు సంతానం. తమ దేశంలో బైక్‌ రైడ్‌లు చేస్తుంటారు. వీరి దగ్గర బీఎండబ్ల్యూ, ఏడు కేటీఏం బైక్‌లు ఉన్నాయి. రౌల్‌ ఇప్పటికే 12 దేశాల్లో బైక్‌ రైడ్‌ చేశారు. ఆయనకు ఫ్లైట్‌లో వెళ్లడం కంటే బైక్‌పై తిరుగుతూ ఆయా ప్రాంతాల గురించి తెలుసుకోవడమంటే ఇష్టం. వ్యాపార పనుల నిమిత్తం తొలిసారి భారత్‌ వచ్చిన వీరు ఇక్కడి ప్రదేశాలను చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి అక్టోబర్‌ 11న బైక్‌ రైడ్‌ ప్రారంభించారు. సిటీకి చెందిన ట్రావెల్‌ గైడ్‌ నాగార్జునరెడ్డి సహకారంతో నాగపూర్, జబల్‌పూర్, ఖజురహో, ఓర్చా, ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, ఇండోర్‌.. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలను చుట్టేసి అక్టోబర్‌ 23న తిరిగొచ్చారు. ఆ ట్రిప్‌ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారిలా...  

? విదేశీ రైడర్లకు మీరిచ్చే సలహాలు.  
భద్రత ముఖ్యం. మంచి కండీషన్డ్‌ బైక్‌ను ఎంచుకోవాలి. ఇక్కడి భాష, సంప్రదాయాలు తెలిసిన గైడ్‌ ఉండాలి. అయితే రోడ్‌ ట్రిప్‌లు పూర్తిగా మనం ప్లాన్‌ చేసుకున్నట్లు సాగవు. అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లాలి. విదేశీయులు రోడ్‌ ట్రిప్‌ చేసేందుకు భారత్‌ సేఫ్‌ కంట్రీ. కాకపోతే ట్రాఫిక్‌ ఎక్కువ. ఇక్కడ రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యలు తగ్గితే టూరిస్టులు మరింత మంది ఇక్కడ రోడ్‌ ట్రిప్‌లు చేస్తారు.  

? బైక్‌ రైడ్‌ ఎంచుకోవడానికి కారణం.  
రోడ్డు ప్రయాణం చేసినప్పుడే ఆ ప్రాంతం గురించి, అక్కడి ప్రజల గురించి వివరంగా, కరెక్టుగా తెలుసుకోగలం. భారత్‌ గొప్ప సంస్కృతి ఉన్న దేశం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు ఇది నెలవు. చరిత్ర గురించి తెలుసుకోవడమంటే మాకు ఎంతో ఇష్టం.   

? ఈ ట్రిప్‌లో మీ అనుభవాలు.  
చాలా వరకు మంచి అనుభవాలే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు స్నేహంగా ఉంటారు. సంస్కారం గొప్పది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ఆహారం విభిన్నం. విదేశీయులకు ఇక్కడి అభిరుచులు, అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు చూడడం కనులపండగే. ఇక చేదు అనుభవాలంటే డ్రైవింగ్‌ స్టైల్‌. చాలా వరకు ట్రాఫిక్‌ రూల్స్‌ పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అస్సలు బాగాలేవు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అలాంటి చోట్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రోడ్డు మార్గంలో దేశం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది పెద్ద ఇబ్బంది. ఇక మరో ముఖ్య విషయం అపరిశుభ్రత. రోడ్డు పక్కన ఉండే దాబాలు, రెస్టారెంట్‌లలో టాయిలెట్‌లు శుభ్రంగా ఉండేలా చూస్తే బాగుంటుంది. 

? ఇండియా గురించి ఏం తెలుసుకున్నారు.  
ఇక్కడికి వచ్చే ముందు వరకు ఇండియా గురించి పెద్దగా ఏం తెలియదు. ఈ దేశానికి చాలా చరిత్ర, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలున్నాయని మాత్రమే విన్నాం. ఇక్కడి చారిత్రక ప్రదేశాలను చూసి ఇంకా చాలా తెలుసుకున్నాం. యోగా, మెడిటేషన్‌ భారత్‌లోనే పుట్టాయని తెలుసుకున్నాం. వాటిని బాగా ప్రాక్టీస్‌ చేస్తారు కాబట్టే ఇక్కడి ప్రజలు ప్రశాంత స్వభావంతో ఉన్నారు. ఇక ట్రాఫిక్‌ చిక్కులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోరు. అదే పనిగా హారన్‌ కొట్టినా, గమ్మున పక్కకు వెళ్లిపోతారు. అదే మెక్సికోలో అయితే ఒక్కసారి కంటే ఎక్కువ హారన్‌ కొడితే గొడవకి దిగుతారు.

బిర్యానీ.. ఇరానీ
హైదరాబాద్‌ నుంచే మా రోడ్‌ ట్రిప్‌ ప్రారంభించాం. ఇక్కడి చారిత్రక కట్టడాలు, చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సాంకేతిక, ఐటీ రంగాల్లో నగరం పురోగమిస్తోంది. ఒక నగరం త్వరగా అభివృద్ధి చెందేందుకు ఈ కాంబినేషన్‌ ఉపయోగపడుతుంది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్‌ టెస్ట్‌ అదిరింది. వీటిని టేస్ట్‌ చేయడానికి మళ్లీ వస్తాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top