తెలంగాణలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

First Zero FIR In Telangana Registered In Subedari PS Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఓ యువతి మిస్సింగ్‌ కేసులో వరంగల్‌ జిల్లా సుబేదారి స్టేషను పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. వివరాలు... శాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు సుబేదారి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో యువతి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం పట్ల వరంగల్‌ సీపీ రవీందర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబేదారి పోలీసులను ఆయన అభినందించారు.

కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దిశపై అఘాయిత్యం జరిగిన రోజు తమ పరిధి కాదంటూ పోలీసులు ఆలస్యం చేయడం వల్లే తమ కూతురుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ రాష్ట్ర డీజీపీ పోలీసులను ఆదేశించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైతం జీరో ఎఫ్ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లానందిగామలో మొదటిసారిగా బాలుడి మిస్సింగ్‌ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్‌ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top