2019–పండగల తేదీలు ఖరారు | Sakshi
Sakshi News home page

2019–పండగల తేదీలు ఖరారు

Published Wed, Aug 15 2018 10:44 AM

Festiva lDates Fixed In 2019 Telangana state astrology conferences - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు–2018లో మంగళవారం 2019 ఏడాదికి సంబంధించి పండగ తేదీలను వేదపండితులు ఖరారు చేశారు. ఈ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

చైత్రమాసం ఏప్రిల్‌ 6న ఉగాది, 13న స్మార్తానాం శ్రీరామనవమి, 14న శ్రీవైష్ణవానాం శ్రీరామనవమి, 17న మహావీర జయంతి, 19న శ్రీ హనుమద్విజయోత్సవం, వైశాఖ మాసం మే నెలలో 7న అక్షతదియ, పరశురామ జయంతి, బసవజయంతి, 17న సర్వేషాం నృసింహజయంతి, 29న శ్రీహనుమజ్జయంతి, జ్యేష్ఠమాసం జూన్‌ 17న వట సావిత్రీవ్రతం, ఆషాఢ మాసం జులై 4న జగన్నాథ రథయాత్ర, 16న వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ, 21న సికింద్రాబాద్‌ మహంకాళి జాతర, శ్రావణమాసం ఆగస్టు 4న నాగుల చవితి, 5న నాగ, గరుడ పంచమిలు, 9న వరలక్ష్మీవ్రతం, 14న హయగ్రీవజయంతి, 15న రాఖీ పూర్ణిమ, 23న స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 24 శ్రీవైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, శ్రీవేంకటేశ్వరవ్రతం, భాద్రపద మాసం సెప్టెంబర్‌ 1న బలరామ జయంతి, 14న మహాలయపక్షారంభం, 28న మహాలయ అమావాస్య, 29న శ్రీ దేవీ శరన్నవరాత్రారంభం, ఆశ్వీజమాసం అక్టోబర్‌ 5న సరస్వతీ పూజ, గరుడ జయంతి, 6న దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, 8న విజయదశమి, 27న దీపావళి, నరకచతుర్దశి, 31న నాగుల చవితి, కార్తీక మాసం నవంబర్‌ 12న కార్తీక పూర్ణిమ, మార్గశిరమాసం డిసెంబర్‌ 2న శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి, 8న గీతాజయంతి, 11న శ్రీదత్త జయంతి, 19న కాలభైరవాష్టమి.  

జ్యోతిష విజ్ఞానాన్ని అందించడం మా బాధ్యత
ధర్మాచరణే లక్ష్యంగా లభించిన జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తమపై ఉందని విద్వత్సభ కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ అన్నారు. ‘పండగల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా చూడాలి. అదే విధంగా జ్యోతిష పండితులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రథమ జ్యోతిష మహాసభలు నిర్వహించామ’న్నారు.

ధార్మిక పరిషత్‌ ఏర్పాటుచేయాలి...  
31 జిల్లాల నుంచి వచ్చిన పండితులందరూ ఏకాభిప్రాయంగా ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ధార్మిక మండలి కూడా ఉండాలని కోరారు. గౌరవ వేతనంతో ప్రతి ముఖ్యమైన ఆలయానికి ఆగమ శాస్త్ర సలహాదారుణ్ణి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అదే విధంగా ఆలయ అర్చకుడు ఏం చేయాలి? ఏ నియమాల ఆధారంగా పూజలు నిర్వహించాలి? అర్చకులు, పురోహితులు, వేదపండితులు, ధార్మికవేత్తల విధివిధానాలు ఏంటీ? అనే అంశాలపై అవగాహనకు వర్గల్‌ సరస్వతి క్షేత్రంలో  డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టనున్నాం.  

కరదీపిక తయారీ...  
భవిష్యత్‌ తరాలకు పూజలు ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలనే దానిపై అవగాహన కల్పించేందుకు కరదీపికను సత్వరమే ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. యువతలో ధార్మిక చింతన కల్గించేందుకు చర్యలు తీసుకోనున్నాం. 

Advertisement
Advertisement