ఈ సారికి పాత పథకమే..! | Fee Reimbursement old Scheme only continue for this year | Sakshi
Sakshi News home page

ఈ సారికి పాత పథకమే..!

Feb 12 2015 2:11 AM | Updated on Sep 2 2017 9:09 PM

విద్యార్థుల ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’కు ఈ ఏడాదికిగాను పాత మార్గదర్శకాలనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీ సర్కార్ నిర్ణయం
- మార్చి ఆఖరులోగాఫీజుల చెల్లింపు
- సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
- శుక్రవారం మరోసారి భేటీ కానున్న సబ్‌కమిటీ

 
హైదరాబాద్: విద్యార్థుల ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’కు ఈ ఏడాదికిగాను పాత మార్గదర్శకాలనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల చివరలోగా కాలేజీల రిజిస్ట్రేషన్‌ను, వచ్చేనెలలో విద్యార్థుల గుర్తింపు, వారి ఫీజుల చెల్లింపును పూర్తి చేయాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నాటికి మారిన పరిస్థితులకు అనుగుణంగా ‘ఫీజు’ మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయానికి వచ్చింది.

‘ఫాస్ట్’ పథకంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర సర్కారు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలకు పలు సవరణలు చేసి అమలుచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, టి.రాధా, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరుగనున్న మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఫీజుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించి, వాటి ఆధారంగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని భేటీలో నిర్ణయించారు. అనంతరం మార్గదర్శకాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆమోదం తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారం రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ మార్గదర్శకాలు వెలువడవచ్చని సమాచారం.

ఇక ముందు పకడ్బందీగా..
 2015-16 నుంచి బోగస్ కాలేజీలు, విద్యార్థులకు అడ్డుకునేందుకు పక్కా నిబంధనలను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ప్రతి కాలేజీ నుంచి నెలవారీగా విద్యార్థుల ప్రతిభ, హాజరు నివేదికలతో పాటు తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఈ-పాస్‌లో విద్యార్థుల అడ్మిషన్ సమయంలోనే ఆధార్ తీసుకుని... బోగస్ కాలేజీల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఏడాదిలో 12-13 లక్షల వరకు విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. దీనికి రూ. 2,200 కోట్లు కావాలని అధికారుల అంచనా.
 
వచ్చే ఏడాదే కొత్త నిబంధనలు: కడియం
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొత్త నిబంధనలను 2015-16 నుంచే అమలుచేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుత అడ్మిషన్ల విధానంలోనే మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అధికారులతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల్లో కొందరు కాలేజీలకు వెళ్లడం లేదని, కొంత మంది పరీక్షలు కూడా రాయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. వారి పేర్లు కేవలం రోల్స్‌లో కొనసాగుతున్నాయని.. అలాంటి వారికి ‘ఫీజు’ ఇవ్వబోమని చెప్పారు.

ఇక ఉమ్మడి రాష్ట్రంలో పది వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు ‘ఫీజు’ పథకం వర్తించేలా నిబంధన ఉండిందని.. తెలంగాణ ఏర్పాటుతో విద్యార్థుల సంఖ్య తగ్గే నేపథ్యంలో దానిపై ఏం చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిపొందే విద్యార్థులకు స్థానికతను 371-డీ ప్రకారం నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీహరి చెప్పారు. ప్రస్తుత చదువుతున్నదాని కంటే నాలుగేళ్లు వరుసగా ఇక్కడే చదవడం, గత ఏడేళ్లలో మెజారిటీ భాగం ఇక్కడే చదివి ఉండాలనే నిబంధనను పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement