రోడ్డెక్కిన రైతన్న

Farmers Protest In Nizamabad - Sakshi

ఆర్మూర్‌/పెర్కిట్‌: ప్రభుత్వాల ‘మద్దతు’ కోసం రైతన్నలు రోడ్డెక్కారు.. గిట్టుబాటు ధరలు ప్రకటించాలని నాలుగు గంటల పాటు గురువారం 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి చౌరస్తాలో నిరసనకు దిగారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆత్మగౌరవ ర్యాలీ కార్యక్రమానికి ఆర్మూర్‌ డివిజన్‌లోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన విరమించబోమని భీష్మించారు. ఒక దశలో రాస్తారోకో చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించుకుని శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు.

నాలుగు గంటల పాటు బైఠాయింపు.. 
ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మామిడిపల్లి చౌరస్తాకు తరలి వచ్చిన రైతులు ఉదయం 11 గంటలకు హైవేపై బైఠాయించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రైతుల నిరసన కొనసాగింది. గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. వన్‌ వే నుంచి వాహనాలను మళ్లించారు. డిమాండ్లు నెరవేర్చాల్సిందే..

రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తుండటంతో జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, మార్కెటింగ్‌ ఏడీ రియాజ్, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్‌ రాణాప్రతాప్‌ సింగ్‌ అక్కడకు చేరుకొని రైతు నాయకులతో మాట్లాడారు. మీ డిమాండ్లు తెలియజేస్తే కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో ఐక్య వేదిక నాయకులు వి.ప్రభాకర్, అన్వేష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవరాం, చిన్నారెడ్డి తదితరులు మాట్లాడుతూ పసుపు పంటకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.3,500 చొప్పున గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

దళారులకు అధికారుల వత్తాసు 
మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్‌లో పసుపు ధర రూ.9 వేలు పలుకుతుంటే, నిజామాబాద్‌ మార్కెట్‌లో రూ.4–5 వేల లోపు ధర పలకడం వెనక ఆంతర్యమేమిటని రైతు నాయకులు ప్రశ్నించారు. అధికారులు దళారులకు, వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈనామ్‌లో పసుపు పంట నాణ్యత వివరాలను అధికారులు నమోదు చేయకపోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు టెండర్‌లో పాల్గొనడం లేదన్నారు.

ఈనామ్‌లో అధికారులే రూ.4 వేల నుంచి ధర టెండర్‌ కోట్‌ చేయడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ కోట్‌ చేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పలుమార్లు రైతులను మోసం చేసిన వ్యాపారులకే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఇచ్చిన అధికారులు మళ్లీ అదే పునారవృతమైతే బాధ్యత వహిస్తారా? అన్ని ప్రశ్నించారు. ఈనామ్‌లో పసుపు ధర రూ.10 వేల నుంచి టెండర్‌ కోట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర నిర్ణయించే సమయంలో రైతు సమన్వయ సమితి సభ్యులే కాకుండా రైతు కమిటీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.

సర్కారుకు అల్టిమేటం.. 
ప్రభుత్వం రైతులకు తోడ్పాటునందించాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల మేరకు పంటకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్‌ చేశారు. రూ.2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డి మాండ్‌ చేశారు. అదేవిధంగా రైతులకు హెల్త్‌ కా ర్డులు అందజేసి, ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతుల డిమాండ్లపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించలేదు.

దీంతో తమ డిమాండ్లు సా ధించుకొనే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, కలెక్టర్‌తోనూ మాట్లాడతామని, ఆందోళన విరమించాలని అధికారులు, పోలీసు లు నచ్చజెప్పారు. అయితే, ఈ నెల 11వ తేదీ వర కు తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే 12వ తేదీన కుటుంబానికి ఇద్దరు చొప్పున ఆర్మూర్‌కు తరలి వచ్చి భారీ ఆందోళన చేపడతామని రైతు నాయకులు హెచ్చరించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. 
గతానుభవాల నేపథ్యంలో పోలీసులు రైతుల ఆందోళన విషయంలో శాంతియుతంగా వ్యవహరించారు. 2008లో ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన పోలీస్‌ శాఖ వైఫల్యం కారణంగా హింసాత్మకంగా మారి కాల్పులకు దారి తీసింది. అయితే, తాజాగా పోలీసులు రైతులతో శాంతియుతంగా వ్యవహరించారు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్‌ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఏసీపీ రాములు, సీఐలు, ఆర్‌ ఎస్సైలు, సివిల్‌ ఎస్సైలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. రైతులు సంయమనం కోల్పోయిన ప్రతీసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top