ఫర్టిలైజర్‌ దుకాణం ఎదుట రైతుల ధర్నా

Farmers Protest At Fertilizer Shop - Sakshi

నకిలీ పురుగు మందులతో వరి ఎండిపోయిందని ఆరోపణ

నర్సాపూర్‌రూరల్‌/వెల్దుర్తి(తూప్రాన్‌) :  పురుగుల నివారణకు నకిలీ ముందులు ఇవ్వడంతో వరి పంట ఎండిపోయిందని వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం నర్సాపూర్‌ పట్టణంలోని కపిల్‌ ఫర్టిలైజర్‌ దుకాణం ఎదుట ధర్నా నిర్వహించారు. మానేపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మయ్య గత నెలలో తనకు ఉన్న రెండు ఎకరాల వరి పంటకు మొగి పురుగు సోకడంతో కపిల్‌ ఫర్టిలైజర్‌ దుకాణంలో నివారణ ముందులు కొనుగోలు చేశాడు. వాటిని పంటపై పిచికారి చేయగా రెండు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గొల్ల లక్ష్మయ్య పంట చేను చుట్టుపక్కల రైతుల పంటకు సైతం మొగిపురుగు సోకగా మెదక్, వెల్దుర్తి, కౌడిపల్లి ఇతర గ్రామాల్లో నివారణ మందులు కొనుగోలు చేసుకొని తీసుకు వచ్చి పిచికారి చేశారు.

వారి పంటలో పూర్తిగా పురుగులు చనిపోయాయని, పంట ఏపుగా పెరుగుతోందని తెలిపారు. ఫర్టిలైజర్‌ దుకాణం యజమాని పురుగుల మందులు రాకెట్, మాక్స్, ఎన్‌ప్యూజ్‌ అనే మూడు రకాలవి ఇచ్చాడన్నారు. ఆయన సూచన మేరకు వాటిని కలిపి పిచికారి చేస్తే పంట పూర్తిగా ఎండిపోయి చేతికి రాకుండా పోయిందని రైతులు తెలిపారు. నకిలీ పురుగుల మందులు ఇవ్వడంతోనే గొల్ల లక్ష్మయ్య రెండు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని, అతడికి నష్ట పరిహారం చెల్లించాలని పట్టుబడుతూ దుకాణం ఎదుట ధర్నా చేశారు.

కంపెనీ వారితో మాట్లాడి న్యాయం చేస్తానని దుకాణం యజమాని నచ్చజెప్పడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. ఫర్టిలైజర్‌ యజమాని హన్మంతరావును వివరణ కోరగా లక్ష్మయ్య నేను ఇచ్చిన మొగిపురుగు మందులతోపాటు గడ్డి మందు కలిపి కొట్టడంతోనే వరి పంట ఎండిపోయిందని తెలిపారు. కంపెనీవారితో మాట్లాడి లక్ష్మయ్యకు నాయ్యం జరిగేలా కృషి చేస్తానని తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top