రాయితీ విత్తనం.. బహుదూరం | farmers getting loss with purchase in private shops | Sakshi
Sakshi News home page

రాయితీ విత్తనం.. బహుదూరం

Nov 8 2014 12:42 AM | Updated on Mar 28 2018 11:11 AM

రైతులకు రాయితీ కూరగాయల విత్తనాలు అందే విషయంలో అయోమయం నెలకొంది.

యాచారం: రైతులకు రాయితీ కూరగాయల విత్తనాలు అందే విషయంలో అయోమయం నెలకొంది. ఉద్యాన శాఖ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉండడంతో కూరగాయల విత్తనాలు ఎప్పుడు వస్తున్నాయో... విక్రయాలు ఎప్పుడు జరుగుతున్నాయో రైతులకు సమాచారం తెలియడంలేదు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే 50 శాతం రాయితీ విత్తనాలు దక్కని పరిస్థితి ఏర్పడింది.

దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. యాచారంలోనే ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కూరగాయల రాయితీ విత్తనాలను అందించాలని స్థానిక రైతులు పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోతోంది.

యాచారరం నుంచి ఇబ్రహీంపట్నం 15 కిలోమీటర్ల దూరంలో ఉండడం, పైగా ప్రయాణ ఖర్చులు రూ. 50కి పైగా కావడం, కాల యాపన అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు ధరలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ అందుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.

 వంద హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో..
 మండలంలోని యాచారం, గునుగల్, మొండిగౌరెల్లి, తాడిపర్తి, నందివనపర్తి, గడ్డమల్లయ్యగూడ, మాల్ తదితర గ్రామాల్లోని రైతులు 100 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయల తోటల ను సాగు చేయడానికి పొలాలను సిద్ధం చేశారు. దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు.

 ప్రైవేట్ దుకాణాల్లో  కూరగాయల ధరలు భగ్గుమనడం, ఉద్యాన శాఖ నుంచి రాయితీ విత్తనాలు అందకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి  సారించి తక్షణమే రాయితీ కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ ఇబ్రహీంపట్నం క్షేత్రస్థాయి అధికారి యాదగిరిని సంప్రదించగా మరికొద్ది రోజుల్లో రైతులకు  రాయితీ విత్తనాలు పంపిణీ  చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement