ఇంటర్‌ ఫలితాల ప్రాసెస్‌పై నిపుణుల కమిటీ: సబిత

Expert Committee On Inter Results Process Says Sabitha Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు, ఫలితాల ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సాంకేతిక సహకారాన్ని సీజీజీ నుంచి తీసుకుంటున్నామని, దాని నిర్వహణ తీరును ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిపుణుల సలహాలు తీసుకుంటూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

గతేడాది ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్, మార్చి 4 నుంచి 29 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పరీక్షలకు 9,85,840 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 1,994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్‌ ఖాలిక్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top