ఈఎస్‌ఐ రోగుల నరకయాతన | ESI patients torment of hell | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ రోగుల నరకయాతన

Jun 22 2015 1:13 AM | Updated on Sep 3 2017 4:08 AM

ఈఎస్‌ఐ రోగుల నరకయాతన

ఈఎస్‌ఐ రోగుల నరకయాతన

ఈఎస్‌ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) పరిధిలోని రోగులు పడుతున్న నరకయాతన అంతాఇంతా కాదు.

* రీయింబర్స్‌మెంట్ కోసం వేలాది మంది ఎదురుచూపులు  
* నిధులను తన్నుకుపోతున్న మందుల సరఫరాదారులు

సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) పరిధిలోని రోగులు పడుతున్న నరకయాతన అంతాఇంతా కాదు. కావాల్సిన వైద్యం ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అందక, తీరా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే.. ఈఎస్‌ఐ ఆ డబ్బులివ్వక వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. రీయింబర్స్‌మెంట్ కోసం రోగులు ఈఎస్‌ఐ చుట్టూ నెలలతరబడి తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు.

గతేడాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. సుమారు నాలుగు వేల మంది రోగులు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా బిల్లులు రాలేదు. వీళ్లలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలు, న్యూరో, గ్యాస్ట్రిక్ జబ్బులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లించిన వారే.
 
చిరుద్యోగులకు ఈఎస్‌ఐ దెబ్బ
నెలకు రూ. 15 వేల లోపు వేతనం వచ్చే చిరుద్యోగులే ఈఎస్‌ఐ ఆస్పత్రులకు వస్తారు. వీళ్లలో సుమారు 7 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. మరో 5 లక్షలు ఏపీలోనూ, 2 లక్షల మంది తెలంగాణ జిల్లాల్లోనూ ఉన్నారు. వీళ్లతో పాటు వీరి కుటుంబ సభ్యులకూ ఈఎస్‌ఐ ఉచితంగా వైద్యమందించాలి. ఒకవేళ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు లేకపోతే ప్రైవేటుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఆ డబ్బు ఈఎస్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది.

కానీ వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి వైద్యం చేయించుకున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి మాత్రం ఈఎస్‌ఐ తాత్సారం చేస్తోంది. కాగా, ఈఎస్‌ఐ డెరైక్టరేట్లకు వచ్చే నిధులను ఆయా ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే బడా డిస్ట్రిబ్యూటర్లు గద్దల్లా తన్నుకుపోతున్నారు. రోగుల శాతాన్ని బట్టి 65 శాతం నిధులు తెలంగాణకు, 35 శాతం ఏపీకి కేటాయించారు.

ఈ నిధులను ఎప్పటికప్పుడు సరఫరాదారులు తన్నుకుపోతుండటంతో రోగులకు ఈఎస్‌ఐ రీయింబర్స్‌మెంట్ చెల్లించలేకపోతుంది. తాజాగా తెలంగాణలో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ చేసి రెండు ఫార్మా కంపెనీలకు ఆర్డరు ఇప్పించుకోగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అధికారులు కూడా కమీషన్లకు కక్కుర్తిపడి ఆస్పత్రుల శ్రేయస్సును కూడా గాలికొదిలేసి సరఫరాదారుల సేవలో తరిస్తున్నారు.
 
ఈఎస్‌ఐ పరిధిలో  ఉద్యోగుల వివరాలు
ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు :  9 లక్షలు
వారి కుటుంబ సభ్యులు : 27 లక్షలు
ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు :  5 లక్షలు
వారి కుటుంబ సభ్యులు : 16 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement