సమష్టిగా నిజాయితీతో పనిచేద్దాం

 Errabelli Dayakar Rao warns staff against dereliction - Sakshi

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖలపై సీఎం కేసీఆర్‌కు ఎంతో నమ్మకం ఉందని, దానిని వమ్ము చేయకుండా అధికారులు, ఉద్యోగులు అందరం కలసి నిజాయితీతో పనిచేద్దామని ఆ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు. గురువారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల అధికారులు, ఉద్యోగులతో మంత్రి ఎర్రబెల్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ శాఖలకు సంబంధించిన అధికారులందరూ ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించినట్టు ఆయన తెలిపారు. 

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. సర్పంచ్‌లను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాల్సి ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పంచాయతీరాజ్‌కు భారీగా నిధులు వస్తున్నాయని, వాటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆ శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్, సెర్ఫ్‌ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

నేడు బాధ్యతల స్వీకరణ
శుక్రవారం ఉదయం 9.30కి సచివాలయంలోని తన చాంబర్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు. ఒక మంచి పనికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేసేలా దస్త్రాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. సెక్రటేరియట్‌ డీబ్లాక్‌ మొదటి అంతస్తులోని చాంబర్‌ 251 (ఆ శాఖ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చాంబర్‌)ను ప్రభుత్వం ఆయనకు కేటాయించిన విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top