ప్రచారం పరిసమాప్తం!

Election Campaign Closed - Sakshi

చివరిరోజు ర్యాలీల హోరు

పట్టణాల్లో జన జాతర

మంథనిలో కాంగ్రెస్‌ బహిరంగ సభ

కాటారంలో టీఆర్‌ఎస్‌ రోడ్‌షో

ఓటర్లకు తాయిలాలు షురూ..

సాక్షి, పెద్దపల్లి: ముందస్తు ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. ప్రచారం పరిసమాప్తమైంది. చివరిరోజు జిల్లాలో అన్ని పార్టీలు ర్యాలీలతో హోరెత్తించాయి. మంథనిలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించగా, కాటారంలో టీఆర్‌ఎస్‌ రోడ్‌షో చేపట్టింది. పోలింగ్‌కు ఒకరోజు ముందు అభ్యర్థులంతా బలప్రదర్శనకు దిగారు. ప్రచారపర్వం ముగియడంతో షరా మామూలుగానే తాయిలాలు, మంతనాలతో మరింత బలపడేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదే సమయంలో ఓటర్లకు పంచేందుకు వస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం కుంటున్నారు. 

ర్యాలీల హోరు
ఎన్నికల ప్రచారం చివరిరోజున అన్ని పార్టీలు ర్యాలీలు, రోడ్‌షో, బహిరంగసభలతో హోరెత్తించాయి. పోలింగ్‌కు కొద్ది గంటల ముందు, తమకున్న చివరి అవకాశాన్నిసద్వినియోగం చేసుకొనేందుకు భారీగా బలప్రదర్శనకు దిగాయి. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దాసరి మనోహర్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి భారీ ప్రదర్శన నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ సమీపం నుంచి ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ర్యాలీ, బస్టాండ్, కమాన్‌ మీదుగా జెండా చౌరస్తా, మసీదు చౌరస్తా నుంచి అయ్యప్ప దేవాలయం వరకు సాగింది. పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య, గోపగాని సారయ్యగౌడ్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. రంగంపల్లి వద్ద ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ కమాన్‌ నుంచి జెండా చౌరస్తా, మసీదు చౌరస్తా మీదుగా అయ్యప్పఆలయం వద్ద ముగిసింది. అభ్యర్థి చింతకుంట విజయరమణారావుతోపాటు నాయకులు సి.సత్యనారాయణరెడ్డి, ఈర్ల కొమురయ్య, వేముల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ర్యాలీ బస్టాండ్‌ సమీపం నుంచి ప్రారంభమై కమాన్, జెండా చౌరస్తా నుంచి మసీదు చౌరస్తా మీదుగా అయ్యప్ప ఆలయం వరకు సాగింది.

పార్టీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డితోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, మాజీ అధ్యక్షుడు మీస అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖనిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు సోమారపు సత్యనారాయణ, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, కోరుకంటి చందర్‌ ర్యాలీలు నిర్వహించారు. తిలక్‌నగర్‌లో ప్రారంభమైన కోరుకంటి చందర్‌ ర్యాలీ, రమేశ్‌నగర్, కల్యాణ్‌నగర్, మెయిన్‌చౌరస్తా మీదుగా, పవర్‌హౌజ్‌కాలనీ నుంచి ఐబీ కాలనీ వరకు సాగింది. సోమారపు సత్యనారాయణ జీఎం కాలనీ, బాపూజీనగర్, జ్యోతినగర్, విఠల్‌నగర్, ఎన్‌టీఆర్‌ నగర్‌లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఫైవ్‌ఇంక్లయిన్‌ నుంచి మొదలైన మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ర్యాలీ, తిలక్‌నగర్, జవహర్‌నగర్, మెయిన్‌ చౌరస్తా, ఎన్‌టీపీసీ మీదుగా రామగుండం చేరుకుంది.  

బహిరంగసభ... రోడ్‌షో
మంథనిలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించగా, టీఆర్‌ఎస్‌ రోడ్‌షో చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మద్దతుగా మంథని శివారులో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగసభలో ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి పాల్గొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించిన స్థలంలోనే కాంగ్రెస్‌ పార్టీ కూడా బహిరంగ సభ  ఏర్పాటు చేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు నియోజకవర్గంలోని కాటారంలో రోడ్‌షో నిర్వహించారు.

జోరుగా ప్రచారం
ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచి జిల్లాలో ప్రచారం హోరెత్తింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులతోపాటు, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి జిల్లాకు వచ్చారు. ఇతర పార్టీలతో పోల్చి తే ఎక్కువ సభలను నిర్వహించి, ప్రచార విషయంలో టీఆర్‌ఎస్‌ కాస్త ముందుంది. పార్టీ అభ్యర్థుల తరఫున గులాబీ బాస్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, డిప్యూటి సీఎం మహమూద్‌అలీ ప్రచారం చేపట్టారు. పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. కేటీఆర్‌ పెద్దపల్లి, రామగుండంలో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. మహమూద్‌అలీ పెద్దపల్లిలో మైనార్టీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రచారసభలు కచ్చితంగా ఉంటాయని ప్రచారం జరిగినా అవి రద్దయ్యాయి. స్టార్‌ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి సుల్తానాబాద్‌లో రోడ్‌షో నిర్వహించగా, మంథనిలో బహిరంగసభలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పరిపూర్ణానందస్వామి సభలు నిర్వహించేందుకు సన్నహాలు జరిగినా అనివార్యకారణాలతో జరుగలేదు. బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గోదావరిఖనిలో బహిరంగసభకు హాజరయ్యారు. 

ఒట్టేసి చెప్పు ఓటేస్తానని...
ప్రచారం ముగియడంతో తాయిలాలతో ఓటర్లను మచ్చిక చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలయ్యా యి. ఓటర్లను నేరుగా ప్రభావితం చేసేందుకు చోటా మోటా నాయకుల సహకారాన్ని అభ్యర్థులు తీసుకుం టున్నారు. గంపగుత్త ఓట్లకు గాలం వేసేందుకు పెద్ద ఎత్తున హామీలిస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది అభ్యర్థులు ఒకడుగు ముందుకేసి ఓటర్లతో ఒట్టు వేయించుకుంటున్నారు. తాయిలాలు అందిస్తూ, తమకే ఓటు వేయాలని మాట తీసుకుంటున్నారు. కాగా పో లింగ్‌కు ముందు మద్యం, నగదు సరఫరా అధికంగా ఉంటుండడంతో అధికారులు, పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుం టున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదును నియంత్రించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆటోట్రాలీ, వ్యాన్‌లో తరలుతున్న మద్యాన్ని సుల్తానాబాద్, బసంత్‌నగర్‌ ప్రాంతాల్లో పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top