‘రూరల్‌’ పోరు  రసవత్తరం

Election Campaign Ail Party's Leaders In Nizamabad - Sakshi

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో మూడు పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎన్నికల ప్రచారంలో.. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ఆపార్టీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్‌ రెడ్డి కేంద్రంలో మోదీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. తనను గెలిపిస్తే నిస్వార్థంగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌ భూపతిరెడ్డి, బీజేపీ అభ్యర్థి కేశ్‌పల్లి గడ్డం ఆనందర్‌రెడ్డి మధ్య పోరు జోరుగా సాగుతోంది. మూడు పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ ఈ ముగ్గురు అభ్యరులు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను బాజిరెడ్డి వివరిస్తున్నారు. 

అలాగే మరోమారు అధికారంలోకి వచ్చాక తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. పెన్షను లబ్ధిదారులు, రైతులు, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల తమను మరోమారు ఆశీర్వదించాలని కోరుతున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి.. కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెబుతున్నారు.

రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రూ.రెండు వేల పింఛన్‌ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ పథకాలను బీజేపీ అభ్యర్థి కేశ్‌పల్లి గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే తన తండ్రి కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా కోసం చేసిన నిస్వార్థ సేవలు, అభివృద్ధి పనులను ఆనందర్‌రెడ్డి ప్రస్తావిస్తున్నారు. తనకు అవకాశం కల్పిస్తే తన తండ్రిబాటలో నడిచి ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండటంతో రూరల్‌ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
 
పోటా పోటీగా ప్రచారం.. 
ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య ప్రచారం జోరందుకుంది. నెల రోజుల ముందు నుంచే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామగ్రామాన్ని చుట్టి వచ్చారు. ప్రధాన సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి ప్రచారాన్ని వేగవంతం చేశారు. అంతకుముందే నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు దీటుగా ఆనంద్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు కూడా ప్రచార రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top