8 మంది కంటి వెలుగు బాధితుల డిశ్చార్జి

ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడి

నయం కాలేదని ఇద్దరి ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: కంటి వెలుగు ఆపరేషన్‌ వికటించి హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేశారు. పూర్వ వరంగల్‌ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోగా, వారికి వరంగల్‌ జయ నర్సింగ్‌ హోమ్‌లో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేశారు. అందులో 17 మందికి ఆపరేషన్‌ వికటించిన సంగతి తెలిసిందే. వారికి ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స చేస్తున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో అందులో కోలుకున్న 8 మందిని డిశ్చార్జి చేసినట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందుతోందని, ఎవరికీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిలో గోరంట్ల సుజాత (55), అజ్మీర మేఘ్య (70), గోపరాజు బుచ్చమ్మ (65), భగవాన్‌ (70), ఎం.శాంతమ్మ (58), ఎం.రాజయ్య (70), బోలె సరోజన (45), కె.సరోజన (48) ఉన్నారు.  

పూర్తిగా నయం కాకుండానే డిశ్చార్జి!  
డిశ్చార్జి అయిన 8 మందిలో ఇద్దరు మాత్రం తమకు పూర్తిగా నయం కాలేదని ఆరోపించారు. కె.సరోజన కుమారుడు హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. తన తల్లి ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ఆమెకు కళ్లు కనిపించడం లేదన్నారు. డిశ్చార్జి అయిన అందరి పరిస్థితీ అలాగే ఉందని తెలిపారు. డాక్టర్లను అడిగితే సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.

  తన తల్లికి సగమే నయమైందని గోపరాజు బుచ్చమ్మ కుమారుడు కుమారస్వామి అన్నారు. 8 మందికి నయం కాలేదన్న ప్రచారాన్ని డాక్టర్‌ శ్రీనివాసరావు ఖం డించారు. నయం కానప్పుడు అందరినీ కాకుండా 8 మందినే ఎందుకు డిశ్చార్జి చేస్తామని  ప్రశ్నించారు.  ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఆపరేషన్‌ వికటించి ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతిపక్షాల నేతలు రెండు రోజులుగా పరామర్శిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top