8 కిలోల బంగారు నగల చోరీ | Eight kgs gold robbed in hyderabad | Sakshi
Sakshi News home page

8 కిలోల బంగారు నగల చోరీ

Oct 14 2014 2:05 AM | Updated on Sep 2 2017 2:47 PM

8 కిలోల బంగారు నగల చోరీ

8 కిలోల బంగారు నగల చోరీ

ముంబై సేల్స్‌మెన్ నుంచి 8 కిలోల బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోలీసుల మని చెప్పి దుండగులు లాక్కొని పారిపోయారు.

* పోలీసులమని చెప్పి నగలు లాక్కొని పరారైన దుండగులు
* అపహరణకు గురైన వాటి విలువ సుమారు రూ. 2 కోట్లు
* రంగంలోకి 6 ప్రత్యేక పోలీసు బృందాలు
 
హైదరాబాద్: ముంబై సేల్స్‌మెన్ నుంచి 8 కిలోల బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోలీసుల మని చెప్పి దుండగులు లాక్కొని పారిపోయారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ. రెండు కోట్లుంటుందని అంచనా. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై బాధితులు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్పెక్టర్ అశోక్ కథనం ప్రకారం.. ముంబై జవేరీ బజార్‌లోని ఎంవీఎస్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసే జతిన్ ప్రతాప్‌సిన్ కపాడియా, దేవేంద్ర త్రివేది, హితేష్, సచిన్ నగరానికి ఈ నెల 8న వచ్చారు. నగరంలోని పలు జ్యూయలరీ షాపుల్లో వారి వద్ద ఉన్న ఆభరణాల మోడల్స్‌ను చూపించారు. ఆర్డర్ ఇచ్చేందుకు ఎవరూ అంగీకరించకపోవడంతో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10:30 సమయంలో లక్డీకాపూల్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ టికెట్ కొనుగోలు చేసేందుకు దేవేంద్ర త్రివేది వెళ్లాడు. హితేష్, సచిన్‌లు కొద్ది దూరంలో ఉన్న బస్సులో ఎక్కారు.

నగల బ్యాగ్‌ను జతిన్ ప్రతాప్‌సిన్ కపాడియా పట్టుకొని నిలబడ్డాడు. ఆ సమయంలో అతని వద్దకు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పి, బ్యాగ్‌ను లాక్కొనేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కపాడియా ఐడీ కార్డులు చూపించాలంటూ ఆరా తీశాడు. ముగ్గురూ అతన్ని రౌండప్ చేసి బ్యాగ్‌ను లాక్కొని బైక్‌పై వచ్చిన మరో వ్యక్తికి అందజేశారు. బైక్‌పై ఉన్న వ్యక్తి బ్యాగ్‌తో క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఈ ముగ్గురూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కపాడియాతో పాటు దేవేందర్ త్రివేది మరో ఇద్దరు వీరి యజమాని వినిత్‌గాంధీకి విషయాన్ని ఫోన్‌లో చెప్పారు.

సోమవారం నగరానికి వచ్చిన వినీత్ బాధితులతో కలిసి మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ చేసినవారు నార్త్ ఇండియన్ సూడో పోలీస్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీఐ అశోక్ తెలిపారు. కాగా సంఘటన జరిగిన స్థలాన్ని సోమవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ రామ్మోహన్, ఏసీపీ నారాయణ తదితరులు సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement