మంచిర్యాలలో నాలుగు స్తంభాలాట!

Early Elections In Telangana Adilabad Politics - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా అధికార పార్టీలో కలకలం రేగింది. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ శివార్లలో నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన సభ’కు జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాల సాక్షిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చిచ్చు మొదలైంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ సోమవారం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సమావేశాలకు హాజరై ఆయా నియోజకవర్గాల్లో నాయకులకు, కార్యకర్తలు ఓ ‘క్లారిటీ’ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంచిర్యాల జిల్లా నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చిన సుమన్‌ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం బెల్లంపల్లిలో తాను బరిలో నిలవడం లేదని చెప్పారు.

అదే సమయంలో  బెల్లంపల్లిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకే మరోసారి అవకాశం లభిస్తుందని, ఆయనను  లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కూడా పిలుపునిచ్చారు. ఇక మంచిర్యాలలో పార్టీజిల్లా ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు ఆ బాధ్యత తీసుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావే తిరిగి మంచిర్యాల నుంచి పోటీ చేస్తారని, వేరే వారు ఎవరూ రారని స్పష్టం చేశారు. దివాకర్‌రావు స్థానంలో వేరే వారు వస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. మంచి ర్యాల నుంచి దివాకర్‌రావు, బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పిన నేతలు మరో ఎస్సీ రిజర్వుడు స్థానం చెన్నూర్‌పై కొత్త చర్చకు తెరలేపారు. చెన్నూర్‌ నుంచి సుమన్‌ పోటీ చేస్తారని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో చెన్నూర్‌ నుంచి మూడుసార్లు  గెలిచిన నల్లాల ఓదెలు భవితవ్యంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
 
చెన్నూర్‌ టికెట్టుపై ఓదెలు స్వీయ ప్రకటన
మంచిర్యాల, బెల్లంపల్లి పార్టీ సమావేశాల్లో ఎంపీ సుమన్, పార్టీ ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు ప్రకటనల నేపథ్యంలో చెన్నూర్‌లో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముందే జాగ్రత్త పడ్డారు. ‘పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా సేవలందిస్తున్న నాకు అధినేత కేసీఆర్‌ ఆశీర్వాదం ఉంది. పేదోన్నైన నన్ను ఎమ్మెల్యేను, విప్‌ను చేసిండు. వచ్చే ఎన్నికలల్ల గుడ నాకే సీటిస్తానని చెప్పారు. నా సీటు విషయంలో వస్తున్న వార్తలను కార్యకర్తలు నమ్మొద్దు’ అని చెప్పుకున్నారు. అయితే అప్పటికే బెల్లంపల్లిలో చిన్నయ్య పోటీ చేస్తారని చెప్పడం, మంచిర్యాలలో మాట్లాడుతూ జిల్లాలో నుంచే రాజకీయ ప్రస్థానం సాగిస్తాననడాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎమ్మెల్యే ఓదెలు తన టికెట్టుపై తానే స్వీయ ప్రకటన చేసుకున్నారు.
 
రాజకీయంగా సొంత పార్టీలో కలకలం
మూడు నియోజకవర్గాలకు పరిమితమైన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మినహా చెన్నూర్, బెల్లంపల్లి రిజర్వుడు స్థానాలే. వీటిలో మంచిర్యాల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మూడోసారి ఎమ్మెల్యే కాగా, ఈసారి ఆయనకు చెక్‌ పెట్టాలని కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్‌ పుస్కూరి రామ్మోహన్‌రావు పండుగలు, పబ్బాలకు మంచిర్యాలకు వస్తూ తాను పోటీ చేస్తానని చెపుతున్నారు. బీసీ నినాదంతో టిక్కెట్టు సాధిస్తానని మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ ధీమాతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు కుమారుడు విజయ్‌కుమార్‌రావు టిక్కెట్టు రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఓ బట్టల వ్యాపారి, మరో పారిశ్రామికవేత్త, మునిసిపాలిటీ ‘పెద్దలు’ చాలా మందే టిక్కెట్టు రేసుల్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జిల్లా ఇన్‌చార్జి, సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు మంచిర్యాల ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతూ దివాకర్‌రావుకే ఖరారు చేయడం చర్చనీయాంశమైంది.
 
ప్రవీణ్‌ పక్కనుండగానే ప్రకటన...
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌. ఇటీవల మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో కీలకపాత్ర వహించి చైర్‌పర్సన్‌ ఓడిపోయేందుకు కారణమైన నాయకుడు ఆయనే. 2014లోనే టిక్కెట్టు దాదాపు ఖరారైన స్థితిలో చివరి నిమిషంలో చిన్నయ్య సీటు సాధించారు. ఈసారి తనకే టిక్కెట్టు అనే ధీమాతో ఉన్నారు. ఓవైపు ఎంపీ సుమన్‌తో పాటు మరోవైపు మాజీ ఎంపీ వివేక్‌కు దగ్గరివాడిగా ఉంటున్న ఆయనకు సోమవారం నాటి ప్రకటన ఊహించనిది. ప్రవీణ్‌కుమార్‌ ఎమ్మెల్యే పక్కసీట్లో ఉన్నప్పుడే సుమన్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చిన్నయ్యకే సీటు వస్తుందని, తాను సరదాగా చెప్పడం లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో ప్రవీణ్‌ కూడా అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

ఎస్సీ రిజర్వు స్థానాల్లో కుల సమీకరణలు
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు రిజర్వు చేయబడ్డాయి. ఈ మూడు సీట్లలో ఎస్సీల్లోని మూడు వర్గాలకు చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని ధర్మపురి స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ‘మాల’ వర్గానికి చెందిన వారు కాగా, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ‘నేతకాని’ వర్గానికి చెందిన వారు. చెన్నూర్‌ నుంచి నల్లాల ఓదెలు ‘మాదిగ’ వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు పార్లమెంటు నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి మూడు వర్గాలకు చెందిన వారికి సీట్లు ఇచ్చిన సీఎం వచ్చే ఎన్నికల్లో మార్పులు చేస్తారా అనే చర్చ మొదలయ్యింది.

పెద్దపల్లి లోక్‌సభకు ప్రస్తుతం మాల వర్గానికి చెందిన బాల్క సుమన్‌ ప్రాతినిథ్యం వహిస్తుండగా, అదే వర్గానికి చెందిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు ఈసారి లోక్‌సభ సీటిచ్చి, సుమన్‌ను అసెంబ్లీకి తేవాలని నిర్ణయించారు. అయితే మాల వర్గానికి చెందిన సుమన్‌కు చెన్నూర్‌ నుంచి సీటిస్తే ‘మాదిగ’కు స్థానం లేకుండా పోతుందని ఓదెలు వర్గం వాదన. పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలు చేస్తున్న పేద మాదిగనైన తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అన్యాయం చేయరని... ఎవరికి ఏ సీటు ఇవ్వాలో నిర్ణయించేది స్థానిక నేతలు కాదని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top