డీఎస్‌ కుమారుడి ‘ప్రకటన’ కలకలం

డీఎస్‌ కుమారుడి ‘ప్రకటన’ కలకలం


► జనమంతా మోదీ వెంట నిలవాలని జాతీయస్థాయి

► పత్రికకు భారీ ప్రకటన

► రాజకీయంగా చర్చనీయాంశం

► ఆ ప్రకటనతో సంబంధం లేదన్న డి.శ్రీనివాస్‌




సాక్షి, నిజామాబాద్‌: రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత డి.శ్రీనివాస్‌ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్‌ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్‌ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి’’అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు.


ఇది రాజకీయవర్గాల్లో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే డీఎస్‌ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీ సీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్‌ తాజా ప్రకటనతో డీఎస్‌ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్‌ ఖండించారు.



అంటీముట్టనట్లుగా..

2014 ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్‌ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్‌ అవకాశం కల్పించా రు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్‌.. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహ రించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కూడా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. 


ఐదు నెలల క్రితం టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్‌ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంత కాలంగా టచ్‌లో ఉంటోంది. అరవింద్‌ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్‌షాను కలసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్‌ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు.



పార్టీ వీడను: డి.శ్రీనివాస్‌

‘‘నా కుమారుడు అరవింద్‌ ఇచ్చిన ప్రకటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్‌ఎస్‌ను వీడేది లేదు. కేసీఆర్‌ వెంటే ఉంటాను. అరవింద్‌ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్‌ కూడా బీజేపీలో చేరతాడని అనుకోవడం లేదు’’ అని డీఎస్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top