పూడిక మమ!

Drainage System Cleansing GHMC - Sakshi

తొలగింపుపై బల్దియా,జలమండలి నిర్లక్ష్యం  

గ్రేటర్‌కు ముంపు ముప్పు నాలాలు, డ్రైనేజీ లైన్ల ప్రక్షాళన తక్షణావసరం  

అటకెక్కిన మాస్టర్‌ప్లాన్‌లు  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌కు ముంపు ముప్పు పొంచి ఉంది. నాలాలు, మురుగు నీటి కాల్వల్లో పూడిక తొలగింపువిషయంలో జీహెచ్‌ఎంసీ, జలమండలినిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతివేసవిలో వీటిలో పేరుకుపోయే పూడికను తొలగించాల్సి ఉండగా... పనులుఅరకొరగా చేపడుతూ మమఅనిపిస్తున్నాయి. గ్రేటర్‌లో దాదాపు 5వేలకిలోమీటర్ల పరిధిలో మురుగునీటి కాల్వలు, మరో 1,200 కిలోమీటర్ల మేర నాలాలు అందుబాటులో ఉన్నాయి. వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వీటి ప్రక్షాళన చేపట్టాల్సి ఉండగా... అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రానున్న వర్షాకాలంలో ముంపు తప్పదన్న సంకేతాలు సిటీజనులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

వరద సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని కిర్లోస్కర్‌ కమిటీ 2003లో సూచించింది. అయితే 2007లో శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఏర్పాటు కావడంతో విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్‌ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్,  సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్‌వర్క్‌ ప్లాన్, మేజర్, మైనర్‌ వరద కాలువల ఆధునికీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)’ బాధ్యతను ఓయంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరదనీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10వేల కోట్లుఅవసరమవుతాయి. ఈ నిధులతో బుల్కాపూర్, కూకట్‌పల్లి, ముర్కి, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసీగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేసి ఆక్రమణలు నిరోధించాలి. 

ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పనులివీ...  
మురుగునీటి కాల్వలు, నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలి.  
1,200 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8వేల ఆక్రమణలను తొలగించాలి. బీపీఎల్, ఏపీఎల్‌ కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి.  
నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే టౌన్‌ప్లానింగ్‌ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకుగాను రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి.  
వరదనీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు, ప్రజలకు తగిన అవగాహనకు ప్రభుత్వం, రాజకీయపార్టీల సహకారం తప్పనిసరి. లేని పక్షంలో కార్యక్రమం ముందుకు కదలదు.
స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ (వరదనీటి కాలువల) మాస్టర్‌ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు.  
ఆయా పనులు చేపట్టే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అవసరం.  
చెరువుల పునరుద్ధరణ జరగాలి. తద్వారా వర్షపునీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి.  
నాలాల ఆధునికీకరణ పనులకు రూ.10 వేల కోట్లు ఖర్చు కాగలవని జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో ప్రతిపాదించినా నిధుల విడుదల విషయంలో సర్కారు నిర్లక్ష్యంతో నగరం నిండా మునుగుతోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి.   

అటకెక్కిన డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్‌...   
గ్రేటర్‌ పరిధిలో సుమారు 5వేల కి.మీ పరిధిలో మురుగునీటి పారుదలకు సంబంధించిన పైపులైన్లు ఉన్నాయి. వీటిపై 1.85 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. కానీ గ్రేటర్‌ జనాభా కోటికి చేరువ కావడంతో నివాస, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి వెలువడుతున్న మురుగునీరు ప్రవహించేందుకు అవసరమైన పైపులైన్లు లేకపోవడంతో డ్రైనేజీ రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య. గ్రేటర్‌లో విలీనమైన 12 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఇళ్లలోని సెప్టిక్‌ ట్యాంకుల్లోనే మురుగు మగ్గుతోంది. మరికొన్ని చోట్ల కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. ఆయా కాలనీలు, బస్తీల్లో రూ.3,800 కోట్లతో రూపొందించిన డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్‌ అమలుకు నోచుకోకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top